నల్లగొండ నా గుండె

25 May, 2019 10:49 IST|Sakshi
మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ : నల్లగొండ నా గుండెలాంటిదని, రాజకీయంగా జన్మనిచ్చి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించడంతో పాటు ప్రస్తుతం భువనగిరి ఎంపీగా విజయం సాధించానంటే నల్లగొండ ప్రజల చలువేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భువనగిరి ఎంపీగా విజయం సాధించిన సందర్భంగా ఆయన శుక్రవారం నల్లగొండలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని పనిచేసి తెలంగాణ వెంకన్నగా పేరు తెచ్చుకున్నానన్నారు. ప్రస్తుతం ఎంపీ అయ్యానంటే అది కూడా నల్లగొండ ప్రజల చలువేనన్నారు.

సీఎం కేసీఆర్‌ నన్ను ఓడించడం కోసం ఇన్‌చార్జ్‌లను పెట్టాడని ఆరోపించారు. నేను చేసిన ఉద్యమం ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్‌ కూతురు కూడా ఓడిపోయారంటే ప్రజలు టీఆర్‌ఎస్‌పై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తాను జిల్లాలో ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా పరిష్కరించడంతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ ధర్మం, నీతి, నిజాయతీ విజయం సాధించిందన్నారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాబోయేవి కాంగ్రెస్‌ రోజులేనని గుర్తుంచుకోవాలన్నారు.

దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ సారు.. కారు.. పదహారు అన్న కేసీఆర్‌కు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మైండ్‌ బ్లాక్‌ చేశారన్నారు. ముగ్గురు మొనగాళ్ల మాదిరిగా కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విజయం సాధించారన్నారు. కోమటిరెడ్డి మీద ఉన్న అభిమానమే భువనగిరిలో గెలిపించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గుమ్మల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అమరేందర్‌రెడ్డి, తండు సైదులుగౌడ్, బొడ్డుపల్లి లక్ష్మి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు