టీఆర్‌ఎస్‌ను ఎండగట్టేందుకు పాదయాత్ర

1 Feb, 2018 04:27 IST|Sakshi

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు, ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇన్‌పీసీసీ తరఫున పాదయాత్ర చేయాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల చార్జి కుంతియాకు చెప్పానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో లబ్ధిపొందాలంటే మార్చికల్లా 50 శాతం మంది అభ్యర్థులను ప్రకటించాలని సూచించానని తెలిపారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించానన్నారు. తనకు బాధ్యతలిస్తే తెలంగాణ అంతా తిరుగుతానని, లేదంటే నల్లగొండలో అన్ని స్థానాలు గెలిపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లనందుకే బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని, ఇది రాజకీయ హత్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. సీబీఐ విచారణ కోసమే కోర్టును ఆశ్రయించామని, కాల్‌డేటా ఇవ్వబోమని సీఎం చెంచాలు చెబుతున్నారని, ఆ మాట హోంమంత్రి లేదా డీజీపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ హత్యారాజకీయాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు