రేవంత్‌ రెడ్డిని ఎంతపెట్టి కొన్నారు: కేటీఆర్‌

4 Mar, 2019 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కులను కేసీఆర్‌ ఎంతకు కొన్నారో చెప్పాలని నిన్న ఉత్తమ్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే.  ఆయన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు (కాంగ్రెస్‌) ఎంతకు కొన్నారని కౌంటర్‌ ప్రశ్న వేశారు. టీడీపీ నుంచి గెలిచిన రేవంత్‌ రెడ్డిని ఎంతకు కొన్నారని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, యాదవ రెడ్డిలను ఎంతకు కొనుగోలు చేశారో ఉత్తమ్‌ చెప్పాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూపీలో  ఆదివారం రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలేను ఎంత డబ్బులు పెట్టి కొన్నారని ప్రశ్నించారు. వీటన్నింటిపై ఉత్తమ్‌ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. (ఎంత చెల్లించి మా ఎమ్మెల్యేలను కొన్నారు: ఉత్తమ్‌)

రాజకీయాల్లో పార్టీలు మారడం కొత్తేమి కాదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్‌ పార్టీనే అని కేటీఆర్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 22 ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినప్పుడు ఉత్తమ్‌ ఎక్కడపోయారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ గిరిజనుల సంక్షేమ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని కేటీఆర్‌ వెల్లడించారు. తమ నాయకత్వంలో బలం లేదని, ఉత్తమ్‌ కుమార్‌ను మార్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. మీ నాయకత్వంలో సమర్థత లేక తమపై నిందలు వేయడం సరికాదని కేటీఆర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు