శర్మజీ.. డిసపాయింట్‌ చేస్తున్నందుకు సారీ: కేటీఆర్‌

6 Jul, 2019 15:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిన్నటి కేంద్ర బడ్జెట్‌పై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది తెలంగాణ ‘రైతుబంధు’ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్‌ యోజన’ ను తెచ్చింది.. ఇప్పుడేమో ‘మిషన్‌ భగీరథ’ను స్ఫూర్తిగా తీసుకొని.. ‘హర్‌ ఘర్‌ జల్‌ యోజన’ను తీసుకొస్తుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. మిషన్‌ భగీరథను బీజేపీ కాపీ చేసిందని కేటీఆర్‌ అంటున్నారని, కానీ, కేటీఆర్‌ గుజరాత్‌ సందర్శించి.. అక్కడి వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. మిషన్‌ భగీరథను తీసుకొచ్చారని, కేసీఆర్‌ వీడియోలు యూట్యూబ్‌ డిలీట్‌ చేసినట్టు.. కేటీఆర్‌ గుజరాత్‌ పర్యటన ఫొటోలను గూగుల్ డిలీట్‌ చేసి ఉంటుందని ఆయన భావిస్తున్నారని, ఇది ఆయన అహంకారానికి చిహ్నమని సాగర్‌ అనే నెటిజన్‌ విమర్శలు చేశారు.

ఈ విమర్శలను పట్టుకొని, బీజేపీ సూరత్‌ ఉపాధ్యక్షుడు పీవీఎస్‌ శర్మ ట్విటర్‌ కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘వాటర్‌ గ్రిడ్‌ సిస్టమ్‌ను అధ్యయనం చేసేందుకు మీరు గుజరాత్‌ సందర్శించిన విషయం వాస్తవం కాదా? వాటర్‌ గ్రిడ్‌ను, సబర్మతి నదిలోకి నీళ్లు ఎత్తిపోసే నర్మదా కాలువను మీరు ప్రశంసించలేదు? దాని ఆధారంగానే మీరు కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును చేపట్టలేదా? నిజాలను అంగీకరించండి’ అని పేర్కొన్నారు. పీవీఎస్‌ శర్మ ట్వీట్‌కు కేటీఆర్‌ దీటుగా బదులిచ్చారు. ‘డియర్‌ శర్మ గారూ.. మిమ్మల్ని డిసపాయింట్‌ చేస్తున్నందుకు సారీ.. 1998లో (గుజరాత్‌కు 12 ఏళ్ల ముందు) సీఎం కేసీఆర్‌ సిద్దిపేటలో చేపట్టిన సమగ్ర తాగునీటి ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకొని మిషన్‌ భగీరథను రూపొందించాం. గుజరాత్‌ మోడల్‌ను అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని ప్రధాని లేఖలో కోరితేనే.. ఆ రాష్ట్రాన్ని నేను సందర్శించాను’ అని బదులిచ్చారు.

మరిన్ని వార్తలు