అడ్డంగా దొరికిపోవడం చంద్రబాబుకు అలవాటే: కేటీఆర్‌

4 Mar, 2019 12:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో సంచలనం​ సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్‌ స్కాంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని అన్నారు. వారి అనుమతి లేకుండా సమాచారాన్ని ఐటీ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ హస్తంమేమీ లేదని, ఏపీ ఓటర్ల సమాచారాన్ని టీడీపీ చోరీచేసిందన్న ఫిర్యాదు మేరకే తెలంగాణ పోలీసులు స్పందించారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో  ఏపీ పోలీసులుకు ఏం పనిఅని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారని,  ఏం తప్పుచేయని చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని అన్నారు.

దొంగకు నోరెక్కువ అన్నట్లుగా చంద్రబాబు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఏపీ సీఎంగా కొనసాగే నైతికత ఆయనకు లేదన్న విషయాన్ని ప్రజలు గమనించాలని వ్యాఖ్యానించారు. ఐటీ గ్రిడ్స్‌ మీద విచారణ చేపడితే టీడీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ఐటీగ్రిడ్స్‌కు  ఇవ్వమని ఆయనకు ఎవరు పర్మిషన్‌ ఇచ్చారని, ప్రజల్లో పరపతి తగ్గిపోవడంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని విమర్శించారు. అడ్డంగా దొరికిపోయి బుకాయించుకోవడం ఆయనకు అలవాటేనని, డేటా చోరీ కేసులో చంద్రబాబు తప్పుచేయకపోతే ధైర్యంగా విచారణను ఎదుర్కొవాలని కేటీఆర్‌ సవాల్‌ చేశారు.

మరిన్ని వార్తలు