టీఆర్‌ఎస్‌దే బోగస్‌ సభ్యత్వం: లక్ష్మణ్‌ 

24 Aug, 2019 02:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ సభ్యత్వ నమోదుపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ‘దొంగే దొంగా.. దొంగా..’అన్నట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ తప్పిదాలను ఎదుటి వారిపై రుద్ది ప్రజలను నమ్మించే నాటకానికి కేటీఆర్‌ తెరతీశారని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీకి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను, అధికార పార్టీ ముఖ్యనాయకుల చేరికలను చూసి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు బీజేపీ ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ‘బీజేపీ సభ్యత్వం ఇప్పటికే 18 లక్షలు ఉండగా, కొత్తగా 12 లక్షలు కలుపుకొని 30 లక్షలకు చేరుకుంది. ఇంకా 6 లక్షల సభ్యత్వ నమోదు కావాల్సి ఉంది’అని లక్ష్మణ్‌ తెలిపారు. ‘ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌కు 66 వేల ఓట్లు వస్తే సభ్యత్వం 72 వేలు చేయించిందంటా... ఓటర్లకు మించి సభ్యత్వముందా.. అని ప్రశ్నించారు. 

రామ్‌మాధవ్‌తో వీరేందర్‌గౌడ్‌ భేటీ: టీడీపీ మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ కుమారులు వీరేందర్‌గౌడ్, విజయేందర్‌గౌడ్‌ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే దేవేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్‌ సిద్ధం అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు