వ్యవస్థలను నాశనం చేస్తున్నారు

18 Nov, 2018 04:45 IST|Sakshi

 చంద్రబాబుపై జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మండిపాటు 

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాశనం చేస్తున్నారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పంచాయతీ వ్యవస్థలను జన్మభూమి కమిటీలతో, దాడులలో చిక్కిన అధికారుల నుంచి కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేయడం ద్వారా ఏసీబీని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా స్పీకర్‌ వ్యవస్థను, స్థానిక సంస్థల సాధికారతకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.

రాజకీయ అవినీతిని తారస్థాయికి చేర్చడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను, తన తాబేదార్లను న్యాయవ్యవస్థలో చొప్పించటం ద్వారా ఆ వ్యవస్థను కూడా కళంకితం చేశారన్నారు. తాజాగా సీబీఐ వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2014లో మోదీ ఆకర్షణతో అధికారం పొందిన చంద్రబాబు ప్రస్తుతం మోదీకి వ్యతిరేకంగా కేంద్రంపై యుద్ధం చేస్తున్నట్లు నటిస్తున్నారన్నారు. నిప్పులాంటి వాడినని చెప్పుకొనే బాబుకు నిఘా సంస్థలంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. ఢిల్లీ స్పెషల్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ చట్టం ప్రకారం హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ ఏరాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయవచ్చన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా తాను చేసిన పాపాలపై సీబీఐ విచారణ జరుపుతుందేమోనని సీఎం దానిని అడ్డుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు