చంద్రబాబు నియంతలా మారారు 

18 Nov, 2018 04:49 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ నేత ఆనం మండిపాటు 

సీబీఐని అడ్డుకోవడం దేశ భద్రతకే ముప్పు

రాజ్యాంగేతర శక్తిగా బాబు మారారు 

కేంద్రం, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి 

వ్యవస్థలన్నింటినీ సక్రమంగా నడపాలి 

జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక హత్యాయత్నం కుట్ర 

సాక్షి, హైదరాబాద్‌: స్వార్థం కోసం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఓ నియంతలా మారారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను పనిచేయనీయకుండా అక్రమాలను, అరాచకాలను బయటకు రాకుండా బాబు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి వెళ్లి ‘సేవ్‌ నేషన్, సేవ్‌ డెమాక్రసీ’ అని మాట్లాడిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తాను చేసే అక్రమాలను ఏ వ్యవస్థా ప్రశ్నించడానికి వీల్లేదంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రాష్ట్రంలో విచారణ జరిపే హక్కులేదని చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇవ్వడం ద్వారా సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తిని, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే దుస్సాహసానికి ఒడిగట్టారని, దీనికి అడ్డుకట్టవేయకపోతే దేశ భద్రతకే ప్రమాదమని హెచ్చరించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ అంతర్భాగం కాదా? రాజ్యాంగేతర శక్తిగా పరిపాలన కొనసాగించాలనుకుంటున్నారా? అంటూ చంద్రబాబును నిలదీశారు. సీబీఐ అంటే ఎందుకు గజ గజ వణికిపోతున్నారని, రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేస్తే చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. దోపిడీ చేసిన దొంగ ఇంటికి వెళ్లాలంటే పోలీసులు కూడా ఆ దొంగ అనుమతి తీసుకోవాలనే చందంగా చంద్రబాబు సర్కార్‌ జీవో ఉందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో విపక్షనేతగా చంద్రబాబు మూడుసార్లు సీబీఐ విచారణకు డిమాండ్‌  చేశారని, దానికి స్పందించిన వైఎస్‌ వెంటనే సీబీఐతో విచారణ జరిపించారని ఆనం గుర్తు చేశారు. అప్పుడు సీబీఐనే ముద్దు అన్న బాబు ఇప్పుడు ఆ సంస్థ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.  

జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక... 
తనకు 40 ఏళ్ల సీనియార్టీ అని చెప్పుకొనే చంద్రబాబు.. నాలుగు పదుల వయసు నిండని వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక ప్రజలు తిరస్కరించిన యూపీఏ నేతలను కలుస్తూ ప్రజాధనంతో వారికి శాలువాలు కప్పుతున్నారని ఆనం విమర్శించారు. విపక్ష నేత జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేనని తెలిసి మనిషినే లేకుండా చేయాలన్న నీచపు పనికి ఒడిగట్టారా? అంటూ ప్రశ్నించారు. హత్యాయత్నం కుట్రలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే బండారం బయటపడుతుందని భయమా? అని నిలదీశారు. రేపు హైకోర్టు మీకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తుందనుకుంటే దానినీ వద్దంటారా?, ఎన్నికల కమిషన్, ‘సుప్రీం’ కూడా మీ నియంత్రణలో ఉండాలని అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. తొలి నుంచి చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఆయనే సుప్రీం అనే స్థాయిలోకి వెళ్లారని ఆనం అన్నారు.  

దోపిడీతో సంపన్న సీఎం అయ్యారు 
చంద్రబాబు లాంటి అనాలోచిత, అహంకారపూరిత సీఎం దేశంలో ఇప్పటి వరకూ ఎవరూ లేరని ఆనం మండిపడ్డారు. గతంలో పాలించిన ఏ ముఖ్యమంత్రులూ సమాఖ్య స్ఫూర్తిని ప్రశ్నించలేదని చెప్పారు. దోపిడీ రాజ్యాన్ని నడిపి దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు మారారని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను చంద్రబాబు అనుకూలంగా మార్చుకుని వ్యవస్థలనే నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ఈ వ్యవహారం దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పు అని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకుని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. మూడు నెలల క్రితమే సీబీఐ ఏపీలో విచారణ చేయవచ్చు అని చెప్పిన చంద్రబాబు.. అంతలోనే ఎందుకు నిర్ణయం మార్చుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రత్యేక దేశమని, దానికి తానే నియంతని చంద్రబాబు భావిస్తున్నారని, రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్న బాబుకు ఇక ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని 
ఆనం అన్నారు.   

మరిన్ని వార్తలు