అమరావతికి అరకొర

9 Mar, 2018 09:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో నిత్యం హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం దానికి మున్సిపాల్టీ స్థాయి నిధులు కూడా కేటాయించలేదు. రూ.వేల కోట్ల నిధులతో రాజధాని ప్రాజెక్టులు చేపట్టినట్లు, వాటికి ప్రణాళికలు రూపొందించినట్లు చేస్తున్న ప్రకటనలకు, బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు పొంతనే లేదు. మంత్రి యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాజధాని ప్రాజెక్టులకు రూ.678 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. అందులో భూసమీకరణ కోసం రూ.166 కోట్లు చూపగా, ప్రాజెక్టులకు రూ.457 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాజధాని నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారో అంతుబట్టడంలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  –సాక్షి, అమరావతి

ఆశ్చర్యపోతున్న సీఆర్‌డీఏ వర్గాలు 
రాజధానిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల విలువే రూ.30 వేల కోట్లు ఉన్నట్లు సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి. రోడ్డు గ్రిడ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఆర్టీరియల్, మేజర్, సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్ల పనులకు రూ.6 వేల కోట్లకుపైగా కావాలని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ పరిపాలనా నగరంలో ముఖ్య కట్టడాలకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు, ముఖ్యమంత్రి, గవర్నర్‌ నివాస భవనాలను ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిజైన్ల ప్రక్రియను త్వరలో పూర్తి చేసి ఈ భవనాలకు టెండర్లు పిలుస్తామని చెబుతోంది. అలాగే కృష్ణానదిపై రూ.1400 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారు.

బడ్జెట్‌ కేటాయింపులు చూసి రాజధాని ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో అంతుబట్టడం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది బడ్జెట్‌లో రాజధానికి రూ.1,429 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది అందులో సగం కూడా కేటాయించకపోవడం పట్ల సీఆర్‌డీఏ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ.678 కోట్లు సిబ్బంది జీతాలు, కన్సల్టెన్సీల ఫీజులకు కూడా చాలవని అంటున్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో చేసేదంతా హడావుడేనని ఆచరణ హీనంగా ఉందని స్పష్టమవుతోంది.  

జిల్లాకో స్మార్ట్‌ సిటీకి దిక్కు లేదు 
మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలకు కేటాయించిన నిధులపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్‌ శాఖకు మొత్తం రూ.7741 కోట్లు కేటాయించారు. స్మార్ట్‌ సిటీస్, అమృత్‌ పథకాలకు కేటాయించిన నిధులకు, అక్కడ జరుగుతున్న పనులకు పొంతన ఉండటం లేదు. జిల్లాకో స్మార్ట్‌ సిటీ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. ఈ బడ్జెట్‌లో వాటి ప్రస్తావనే లేదు. రాబోయే రోజుల్లో అమరావతిని స్మార్ట్‌ సిటీ నగరాల్లో మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా ఉంచుతామని, మిగిలిన నగరాలకు ఒక సూచికగా ఉంటుందని చెబుతున్న సీఎం అందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. స్మార్ట్‌ నగరాలుగా ప్రకటించిన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలకు గత ఏడాది కంటే నిధులు అధికంగా కేటాయించారు.

అయితే గతేడాది వీటికి కేటాయించిన రూ.250 కోట్లలో రూ.50 కోట్లలోపే ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది వీటి కోసం రూ.800 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టులకు కేంద్రం తన వాటా నిధులను విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల్లో జాప్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమృత్‌ పథకానికి గతేడాది రూ.300 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.490 కోట్లు కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన పట్టణాభివృద్ధి సంస్థలకు ఆర్థిక జవసత్వాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు కేటాయించలేదు. మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి రూ.5 కోట్లనే విడుదల చేసింది. మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి గతేడాది రూ.100 కోట్లను కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో రూ.300 కోట్లను కేటాయించారు. అన్న క్యాంటీన్లకు ఈ బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రాథమిక మౌలిక సౌకర్యాల కోసం రూ.75 కోట్లు, నగర పంచాయతీలు, గ్రేడ్‌–3 పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాలకు రూ.119 కోట్లు ప్రతిపాదించారు. 

మరిన్ని వార్తలు