16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలకు స్పీకర్‌ ఆమోదం

20 Mar, 2020 08:36 IST|Sakshi

ఉత్కంఠగా మారిన మధ్యప్రదేశ్‌ రాజకీయాలు

బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశం

ముందే రాజీనామా అంటూ ఊహాగానాలు

భోపాల్‌ : ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాపై పెద్ద చర్చ జరుగుతుండగా... మధ్యప్రదేశ్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో ఇబ్బందుల్లో పడ్డ కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు (శుక్రవారం) కఠిన పరీక్షను ఎదుర్కొనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో స్పీకర్‌ ఎస్‌పీ ప్రజాపతి నేడు బలపరీక్షను చేపట్టనున్నారు. గత నెల రోజులుగా సాగుతున్న ఈ తతంగానికి ముగింపు పలకే విధంగా గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వెంటనే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం సభాపతిని ఆదేశించింది. (నేడు మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష)

రాజీనామాల ఆమోదం..
ఈ నేపథ్యంలోనే గురువారం అర్థరాత్రి రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌ ప్రజాపతి.. గత రాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి సొంతగా 107 ఎమ్మెల్యేలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీస్పీ, ఓ ఎస్పీ సభ్యుడి మద్దతుగా కూడా ఉంది. దీంతో సభలో మారిన సమీకరణల దృష్ట్యా బలపరీక్షలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం గెలుపొందడం అంతతేలిక కాదు. (బలపరీక్షపై వైఖరేంటి?)

కమల్‌నాథ్‌ రాజీనామా..?
ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష కంటే ముందే ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతు లేకపోవడంతో.. బలపరీక్ష వరకూ వెళ్లి భంగపడటం కన్నా ముందే రాజీనామా చేయడం సబబు అని ప్రభుత్వ వర్గాలు సూచించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పీకర్‌ ప్రజాపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం మధ్యాహ్నాం కమల్‌నాథ్‌ మీడియా సమావేశం  ఏర్పాటు చేసి.. కీలక ప్రకటన చేస్తారని అన్నారు. దీంతో రాజీనామా చేస్తారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం మంతనాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు