‘బీసీలను వేధిస్తున్న బీజేపీ’

15 Mar, 2018 17:06 IST|Sakshi

సాక్షి, ఛండీగర్‌ : యూపీ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో విపక్షాల విజయంతో పాలక బీజేపీపై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి విమర్శల దాడి పెంచారు. దళితులు, బీసీలపై బీజేపీ దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. ఛండీగర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాస్త్రాలకు పదునుపెట్టారు. ఈ సం‍దర్భంగా ఆమె రోహిత్‌ వేముల విషాదాంతం, సహరన్‌పూర్‌ హింసాకాండ వంటి పలు అంశాలను ప్రస్తావించారు. రాజ్యసభలో సహరన్‌పూర్‌ అంశాన్ని లేవనెత్తేందుకు బీజేపీ తనను అనుమతించలేదని ఆరోపించారు. పార్లమెంట్‌లో దళిత సమస్యలను లేవనెత్తనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీల అభ్యున్నతి కోసం తాను ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. తాను ఓబీసీల రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపైనా మాయావతి విరుచుకుపడ్డారు. అగ్రవర్ణ భావజాలంతోనే కాంగ్రెస్‌ మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయలేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు