వాయుసేనలోకి 324 తేజస్‌ ఫైటర్లు

15 Mar, 2018 17:13 IST|Sakshi
తేజస్‌ మార్క్‌ 1ఏ ఫైటర్‌ జెట్‌

సాక్షి, న్యూఢిల్లీ : 324 తేజస్‌ ఫైటర్‌ జెట్లను వాయుసేనలోకి ప్రవేశపెట్టేందుకు భారతీయ వాయుసేన(ఐఏఎఫ్‌) అంగీకారం తెలిపింది. దీంతో ఎంతోకాలంగా యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల కొరతతో ఇబ్బందిపడుతున్న వాయుసేనకు ఊరట లభించనుంది. దాదాపు మూడు దశాబ్దాల పాటుగా అభివృద్ధి దశలో ఉన్న తేజస్‌ ఫైటర్‌ జెట్లు అనుకున్న స్థాయి సాంకేతికతతో సిద్ధం కాలేదు.

దాదాపు రూ. 75 వేల కోట్లతో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) నుంచి 123 తేజస్‌ మార్క్‌ 1ఏ జెట్లను కొనుగోలు చేసేందుకు ఐఏఎఫ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన 201 జెట్లను తేజస్‌ మార్క్‌-2 సిద్ధమైన తర్వాత తీసుకుంటామని తెలిపింది. తేజస్‌ మార్క్‌ 2ను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దాలని ఐఏఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది.

డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో), ఎరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ), హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)లు సంయుక్తంగా తేజస్‌ మార్క్‌ 2 అభివృద్ధిపై దృష్టి సారించాయి. ప్రపంచస్థాయి ఫైటర్‌గా తేజస్‌ మార్క్‌ 2ను రూపొందిస్తే 18 స్క్వాడ్రన్ల తేజస్‌లను తయారు చేసుకోవాలని ఐఏఎఫ్‌ భావిస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

తేజస్‌ గంటకు 350-400 కిలోమీటర్ల రేడియస్‌లో మాత్రమే ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో తనతో పాటు కేవలం 3 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్తోంది. మిగిలిన ప్రపంచ దేశాల వద్ద ఉన్న సింగిల్‌ జెట్‌ ఫైటర్లు అన్ని తేజస్‌ కంటే మెరుగ్గా ఉన్నాయి. స్వీడన్‌ సింగిల్‌ ఇంజన్‌ జెట్‌ ఫైటర్‌ గ్రైపెన్‌-ఈ తేజస్‌కు మూడు రెట్ల సామర్ధ్యాన్ని కలిగివుంది.

గతేడాది జులైలో రెండు తేజస్‌ ఫైటర్లు ఐఏఎఫ్‌లో చేరిన విషయం తెలిసిందే. వీటి స్వ్కాడ్రన్‌కు ‘ఫ్లయింగ్‌ డాగర్స్‌ 45’ అని పేరు పెట్టారు. 2018-2020ల మధ్య ఈ స్క్వాడ్రన్‌లో పూర్తి స్థాయిలో తేజస్‌ ఫైటర్లు చేరుతాయి.

మరిన్ని వార్తలు