‘ఓనమాలు తెలియకుండా మాట్లాడుతున్నారు’

17 Jun, 2018 11:57 IST|Sakshi

సాక్షి, కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టీడీపీ అడ్డంకి అని బీజేపీ నాయకులు అనడం సబబు కాదని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. మైకన్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇచ్చిందన్నారు. రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబుది సవతితల్లి ప్రేమ అయితే జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రభుత్వం తరపున కల్యాణం ఎందుకు నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. కడప జిల్లాకు చంద్రబాబు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు బీజేపీనే ముందుకు రావడం లేదని ఆరోపించారు.

ఉక్కు పరిశ్రమ కోసం ఈనెల 20 నుంచి ఎంపీ సీఎం రమేష్ అమరణ నిరాహారదీక్ష చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేసే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శంకుస్థాపన కోసం ప్రధానిని పిలిపిస్తామని అనడం ముఖ్యం కాదని, నిధులు ఎంత మేరకు కేటాయిస్తారో ముందే స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఓనమాలు తెలియకుండా బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు అడుగుతుంటే, బీజేపీ నేతలు మాత్రం అడగలేదు అనడం సరైన పద్దతి కాదన్నారు. బీజేపీ కుట్ర, అబద్ధపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జిల్లా అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకుంటోందని అన్నారు. అయితే ఇప్పటి వరకూ జిల్లాకు ఎన్ని నిధులు ఇచ్చారో మంత్రి స్పష్టత ఇవ్వలేక పోయారు. జిల్లాకు ఇచ్చిన హామీల గురించి అడిగన ప్రశ్నలకు ఆదినారాయణ రెడ్డి సమాధానం దాటవేశారు.

>
మరిన్ని వార్తలు