ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం

25 Dec, 2023 01:35 IST|Sakshi

ఉద్యోగులు, నిరుద్యోగులకు ఎంతో చేసినా చెప్పుకోలేక వెనుకబడ్డాం: మీడియాతో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి గెలుపులో పాఠాలుంటే.. ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని.. ఆ గుణపాఠాలు నేర్చుకుంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. దేశంలోనే ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చామని, నిరుద్యోగులకు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. కానీ సరైన విధంగా ప్రచారం చేసుకోలేకపోయామని పేర్కొన్నారు.

‘నిజం గడప దాటే లోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంద’న్న సామెత నిజమైందని.. కాంగ్రెస్‌ అబద్ధాలు, అలవి గాని హామీలను ప్రజలు నమ్మారని వ్యాఖ్యానించారు. యూట్యూబ్‌లో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే నివారించలేకపోయామని, దానితోనూ కొంత నష్టం జరిగిందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ‘స్వేద పత్రం’ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన తర్వాత మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఓటమి స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే..
కేవలం 1.85శాతం ఓట్లతో తాము ఓడిపోయామని.. ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల తేడాతో కోల్పోయామని చెప్పారు. ఇది ఘోర పరాజయం కాదని, ఒక స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అలవికాని హామీలు ఇచ్చిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా. మీరు విజయవంతం కావాలని మేం కోరుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. వందరోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. వందరోజుల కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.

తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మొన్ననే నాలుక మడతేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినా.. ఉప ముఖ్యమంత్రి తాము ఆమాటే అనలేద న్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఆరు గ్యారంటీలు కాదు. 142 హామీలున్నాయి. వాటిని లెక్కతీశాం. మా పార్టీ తరఫున శాఖల వారీగా షాడో టీమ్‌లు ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో వాటిని షాడో కేబినెట్‌ అంటారు. అలాంటిదే మా లెజి స్లేచర్‌లో ఏర్పాటు చేసుకుంటాం.

ప్రతి ప్రభుత్వ శాఖలో, ప్రతిరంగంలో సర్కారు పనితీరు.. వారు ఏం చేస్తున్నారు? ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? తదితర అంశాలన్నింటినీ నిశితంగా గమనించి ప్రజలకు వివరిస్తాం..’’ అని కేటీఆర్‌ చెప్పారు. దీప స్తంభంగా మారిన తెలంగాణను ఆరనివ్వబోమని, పడిపోనివ్వబోమని పేర్కొన్నారు.

ఏ విచారణకైనా మేం సిద్ధం
రాజకీయాల్లో పోటీకి వెళ్లిన ప్రతిసారీ గెలుస్తామనే ఆశిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు చెప్తున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడుతామని, ప్రతి అంశంపై రివ్యూ చేస్తామని చెప్పారు. ‘‘అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు, హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా? కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా? అనేది వారి విజ్ఞత. ఏ విచారణ అయినా.. ఏ కమిషన్‌ అయినా.. ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు.

కావాలంటే విచారణ చేయాలని మేమే సభలో డిమాండ్‌ చేశాం. అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం..’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. యువత విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మినట్టు అనిపించిందని.. అప్పుడే స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా ఉందని చెప్పారు. తమ తరఫున చిన్నచిన్న తప్పులు, పొరపాట్లు జరిగాయని.. సవరించుకొని ముందుకెళ్తామని వివరించారు. ఉద్యోగుల జీతాల విషయంలో కరోనా ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతే కొంత ఇబ్బంది వచ్చిందని.. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఊహించని వాళ్లు ఓడిపోయారు!
మీడియాతో లంచ్‌ సందర్భంగా కూడా కేటీఆర్‌ పలు అంశాలపై చిట్‌చాట్‌ చేశారు. ‘‘ప్రజల తీర్పును అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంత చేసినా ఎలా ఓడిపోయాం? ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోవాలి, అక్కడ కేసీఆర్‌ సీఎంగా ఉండాలని ప్రజలు ఓట్లేసినట్టు చెపుతున్నారు. కోనేరు కోనప్ప, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, సింగిరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి వంటి వారు ఓడిపోతారని ఎవరైనా అనుకుంటారా? వారికి రెండు సార్లు అవకాశం ఇచ్చాం కదా.. ఓసారి వీళ్లకు ఇద్దామని ప్రజలు భావించారని అనిపిస్తోంది..’’ అని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు