‘వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మావే’

4 Sep, 2018 19:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్‌ నేతలకు బుద్ధి రావడంలేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి సమక్షంలో మాచారం కాంగ్రెస్‌ ఎంపీపీ ఎల్‌. నర్సింగరావు,తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలని తిట్టకపోవడంతో తెగ బాధపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

నాలుగేళ్లలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిందని.. చివరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మరణించిన చోటకూడా టీఆర్‌ఎస్‌ గెలిచిందని గుర్తుచేశారు.చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా కాంగ్రెస్‌ ఓటమి పాలైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గడ్డం పెంచుకున్నంత మాత్రాన గబ్బర్‌ సింగ్‌ కాలేడని, ఓట్లు పడలేవని ఎద్దేవా చేశారు. రాహుల్‌ సొంత నియోజకవర్గం అమెథీలోని మన్సిపల్‌ వార్డుల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోలేకపోయారని.. తెలంగాణలో ఎలా గెలిపిస్తాడని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నాయకుల కుటుంబాలు రాజకీయాల్లో ఉండొచ్చు.. కానీ కేసీఆర్ కుటుంబం రాజకీయాల్లో ఉంటే తప్పేంటి? అని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్‌ సంక్షేమ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోటలు బద్దలు కొట్టి 100 సీట్లు గెలుస్తామని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు