100 కోట్లు జరిమానా వేశారు.. గుర్తులేదా?

22 Oct, 2019 19:24 IST|Sakshi

చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

సాక్షి, అమరావతి: ఇసుక కొరత అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వర్షాలు, వరదలు కారణంగానే ఇసుక సరఫరా సమస్యగా మారిందని మంత్రి వివరించారు. వరదలు తగ్గగానే ఇసుక సరఫరాను పునరుద్ధరణ పూర్తిస్థాయిలో చేపడతామని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘పారదర్శక నూతన ఇసుక పాలసీ’ని తీసుకొచ్చిందని తెలిపారు. పాలసీ ప్రారంభించినప్పటి నుండి ఎన్నడూ లేని విధంగా నదుల్లో వరద వస్తోందన్నారు.  రైతులకు మేలు చేసేలా నదులు ప్రవహిస్తున్నాయన్నారు. గత పదేళ్లుగా కరవుతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు నీళ్లతో కళకళలాడుతోందన్నారు.

టీడీపీ అనవసర రాజకీయం చేస్తోంది..
ఏడాదికి 2 కోట్లు క్యూబిక్ మీటర్లు ఇసుక అవసరం ఉందని.. ఇప్పుడు 10 కోట్లు క్యూబిక్ మీటర్లు ఇసుక లభిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేసామని మంత్రి చెప్పారు. వరద తగ్గేలోపు సీసీ కెమెరాలు, వెయింగ్ బ్రీడ్జ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై టీడీపీ అనవసర రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఇసుకను దోచుకున్న తీరు ప్రజలందరికీ తెలిసిందేనని..ఇసుకతోనే టీడీపీ వాళ్లు ఓడిపోయారని విమర్శించారు.

ఇసుక దోపిడీ వలనే బోటు ప్రమాదం..
పట్టా భూముల్లో ఉన్న ఇసుకను కూడా సరఫరా చేస్తామని.. 82 పట్టా భూములను గుర్తించామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ వర్షాలు లేవని.. దీంతో ఇసుక తవ్వకాలకు ఆటంకాలు లేకపోవడంతో టీడీపీ నేతలు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ కారణం‍గా రూ.100 కోట్లు జరిమానా కూడా వేశారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. అప్పటి ఇసుక దోపిడీ వలనే బోటు ప్రమాదం కూడా జరిగిందన్నారు. రాక్ సాండ్‌కు కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు