కార్మికులను బెదిరించడం దుర్మార్గం

24 Jul, 2018 11:54 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే డీకే అరుణ

గద్వాల అర్బన్‌ :  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయకపోగా, సమస్యల కోసం పోరాడుతున్న కార్మికులు తెల్లారేసరికి సమ్మె విరమించకపోతే ఉద్యోగాలుపోతాయని స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించడం దుర్మార్గమని ఎమ్మెల్యే డీకే.అరుణ విమర్శించారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే డీకే.అరుణ మద్దతు ప్రకటించి కార్మికులనుద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఇచ్చినమాట ప్రకారం కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్‌ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్‌ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఆర్టిజన్‌ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చి కార్మికులను పర్మినెంట్‌ చేసే వరకు పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డంకృష్ణారెడ్డి దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టిజన్‌ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాజు, రఫీ, మాసుం, అనంతరెడ్డి పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు