'మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు'

15 Sep, 2019 08:47 IST|Sakshi

ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ

సాక్షి, తాడేపల్లిగూడెం : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, బీజేపీలో గుర్తింపుకోసం చవకబారు ప్రకటనలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు మర్చిపోవడంతో ఏదోక రకంగా గుర్తింపు కోసం సంబంధం లేకుండా మాణిక్యాలరావు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు చూసి బీజేపీ మర్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ2 లా వైఎస్సార్‌సీపీ మారిందని మాణిక్యాలరావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. దేవదాయ శాఖ భూముల్ని తాడేపల్లిగూడెంలో ఆక్రమించి అమ్ముకొని, వాటాలు తీసుకోవడం మినహా ఆ శాఖ అభివృద్ధికి ఆయన చేసింది సున్నా అని అన్నారు. దేవదాయ శాఖ భూముల్ని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. 

కార్పొరేట్‌ ద్రోహులను కాపాడుతున్నారు
నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాష్ట్రంలో పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందని చెబుతుంటే మాణిక్యాలరావు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానంపై అవగాహన లోపంతో మాట్లాడుతున్నారన్నారు. రాజధాని భూములపై అప్పటి సీఎం చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడితే చోద్యం చూశారని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వలంటీర్ల వ్యవస్థని కించపర్చేలా మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్‌ ద్రోహులను కాపాడుతున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. అవినీతికి చిరునామాగా మారిన టీడీపి ఎంపీలను చేర్చుకొని రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎరువుల మాఫియాకు, దొంగనోట్లు మార్చే వారికి మాత్రమే మాణిక్యాలరావు న్యాయం చేశారన్నారు. అధికారం ఉన్న సమయంలో అహంకారంతో అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టించిన సంగతులు మరిచిపోయి రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

సీఎం దృష్టికి గోయంకా కళాశాల అంశం
పట్టణంలోని డీఆర్‌ గోయంకా మహిళా కళాశాల విషయంపై సీఎంతో మాట్లాడానని ఎమ్మెల్యే కొట్టు తెలిపారు. ఈ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని, దాతల మనోభావాలు, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతాయన్నారు. ఎస్‌టీవీఎన్‌ హైస్కూలు విషయంపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఎస్వీ రంగారావు విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో సినీనటుడు చిరంజీవి తనతో పలుమార్లు మాట్లాడారని, అక్టోబరు మొదటి వారంలో ఆవిష్కరణ జరగవచ్చన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులు కర్రి భాస్కరరావు, నిమ్మల నాని, కొట్టు విశాల్,  గుండుబోగుల నాగు, గొర్రెల శ్రీను, మానుకొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు