కశ్మీర్‌ తగలబడుతోంది

30 Oct, 2018 04:00 IST|Sakshi
ఉజ్జయినిలోని గుడిలో రాహుల్‌ పూజలు

ఓఆర్‌ఓపీపై మోదీ అబద్ధాలు

ఉజ్జయిని సభలో రాహుల్‌ ధ్వజం

ఉజ్జయిని: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన తప్పుల కారణంగా కశ్మీర్‌ తగలబడుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపిం చారు. రెండురోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో ఆయన పర్యటించారు. ముందు గా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివభక్తుడైన రాహుల్‌ గాంధీ 2010లోనూ ఈ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మాల్వా– నిమాడ్‌ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ మాట్లాడుతూ..ఒక ర్యాంకు– ఒక పెన్షన్‌ (ఓఆర్‌ఓపీ) పథకంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.  మరోవైపు గత కొద్దీ రోజులుగా కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తప్పిదాల కారణంగా జవాన్లు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులకు కశ్మీర్‌ తలుపులు బార్ల తీసిందని ఆరోపించారు. ఎప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్, ఆర్మీ, నేవీ గురించి మాట్లాడే మోదీ..సైనికుల సమస్యలపై మాత్రం పల్లెత్తు మాట మాట్లాడరని విమర్శించారు. అసలు సర్జికల్‌ స్ట్రైక్స్‌ వల్ల సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని మోదీని డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు