దేశం చూపంతా ఇటే..

19 Mar, 2019 00:55 IST|Sakshi

దేశానికి కేసీఆర్‌ లాంటి నాయకుడు అవసరం: కవిత  

జాతీయస్థాయి రాజకీయాల్లో కీలకం కానున్నారు  

ఐదేళ్లలో బీజేపీ వందసార్లు మాట మార్చిందని విమర్శ 

ఎన్నికలు ఏవైనా ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా  

సాక్షి, జగిత్యాల: జాతీయ స్థాయి రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంటి నాయకుడు అవసరమని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రస్తుతం దేశం చూపంతా మన రాష్ట్రం వైపే ఉందన్నారు. జగిత్యాలలో సోమవారం పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కవిత విలేకరులతో మాట్లాడారు. ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఒకసారి నోట్లు, మరోసారి ట్యాక్స్, వందలసార్లు మాట మార్చిందని ఎద్దేవా చేశారు. రామునికి గుడి కడతామంటూ ఆ పార్టీ ముప్పై ఏళ్లుగా చెబుతూనే ఉందని, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీకి గుడి గుర్తొస్తుందని విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం దేశంలోని పార్టీలకు లోపించిందని చెప్పారు. పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలను సీఎం కేసీఆర్‌ ప్రకటించారని.. ఇదే విషయంలో దేశంలోని ఎంతమంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు స్పందించారని ప్రశ్నించారు. దేశంలో ఏ నాయకుడు రైతుల గురించి ఆలోచించట్లేదని చెప్పారు. ఒకప్పుడు 24 గంటల కరెంట్‌ అంటే విడ్డూరంగా చెప్పుకునేవారని, కేసీఆర్‌తో ఇది సాకారమైందన్నారు. గతంలో రైతుల విషయంలో కనీవినీ ఎరుగనివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొన్నారు.  

లోక్‌పాల్‌ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? 
గత ఎన్నికల సమయంలో లోక్‌పాల్‌ ఏర్పాటుపై హామీ ఇచ్చిన బీజేపీ ఐదేళ్లు కాలయాపన చేసిందని కవిత విమర్శించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయంలో లోక్‌పాల్‌ను తెరపైకి తెచ్చి ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో నాయనమ్మ కాలం నుంచి మనువడి దాకా గరీబీ హటావో నినాదమే తప్ప పేదరికాన్ని నిర్మూలించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి బియ్యం కోటా పెంచిందని చెప్పారు. సంక్షేమం కోసం ఏటా రూ.40 వేల కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. దేశంలోని మరే పార్టీ ఇవన్నీ చేయలేవని చెప్పారు.  

బీడీ కార్మికులందరికీ పెన్షన్‌ 
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేర్చుతామని కవిత పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్‌లో 2,800 కోట్లు కేటాయించామని తెలిపారు. మే 1 నుంచి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతామని చెప్పారు. బీడీ కార్మికుల పెన్షన్‌ కోసం పీఎఫ్‌ కటాఫ్‌ను ఎత్తి వేస్తున్నట్లు చెప్పారు. కార్డు ఉంటే రూ. 2 వేల పెన్షన్‌ అందుతుందని చెప్పారు.  

కవిత నామినేషన్‌కు విరాళాలు  
ఎంపీ కవితకు నామినేషన్‌ ఖర్చుల కోసం వివిధ సంఘాల నాయకులు విరాళాలు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ జగిత్యాల నుంచే జైత్రయాత్ర మొదలు కావాలని కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు