‘ఏపీలో టీడీపీకి ఉనికి ఉండదు’

23 Jun, 2019 09:03 IST|Sakshi

బీజేపీ కర్ణాటక ఇన్‌చార్జి మురళీధర రావు

సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో ఎప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినా బీజేపీకి 200 సీట్లు రావడం ఖాయమని కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జి మురళీధర్‌ రావు అన్నారు. చింతామణిలో  శనివారం జరిగిన కోలారు ఎంపీ మునిస్వామి అభినందన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.  రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీలను తిరస్కరిస్తే వీరు అక్రమంగా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. సీఎం కుమారస్వామి కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశమంతా తిరిగి బాబు ఓడిపోయారు!
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందని మురళీధర్‌ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం చంద్రబాబు.. మోదీని ఓడించడానికి దేశమంతటా తిరిగారు.. కానీ తన అభ్యర్థులనే గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం అశోక్‌ మాట్లాడుతూ... చింతామణి మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ బీజేపీలో చేరితే పార్టీ బలోపేతంతో పాటు తాలుకా అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు