వైఎస్‌ జగన్‌ను కలిసిన ముస్లిం యువకులు

5 Sep, 2018 12:32 IST|Sakshi

సాక్షి, పెందూర్తి : శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్‌ చేసారని గుంటూరు బాధిత ముస్లిం యువకులు ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే.

బెయిల్‌పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైఎస్‌ జగన్‌ను కలిశారు. తమకిచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే దేశద్రోహులనే ముద్ర వేసారన్నా..అని జననేతతో ఆవేదన వ్యక్తం చేశారు. తమను అన్యాయంగా అరెస్ట్‌ చేసి చిత్రహింసలకు గురిచేసారని తమగోడు వెల్లబోసుకున్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కేసులన్నీ ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ఇక వైఎస్‌ జగన్‌ 255వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందూర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో కొనసాగుతోంది.

చదవండి: బూతులు తిట్టి.. లాఠీలతో కొట్టి

మరిన్ని వార్తలు