30న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

26 May, 2019 18:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి గద్దెనెక్కనున్నారు. మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు ఆయన ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌...మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే నరేంద్ర మోదీ ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 

కనీవినీ ఎరుగని రీతిలో నువ్వా నేనా అన్నట్టు సాగిన సార్వత్రిక సమరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అసాధారణ రీతిలో 303 స్థానాలను కైవసం చేసుకుంది. చౌకీదార్‌ చోర్‌ హై అంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానిగా ఎన్నికల బాధ్యత అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని నడిపించి, కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో ఎన్డీయేని మరోసారి విజయపథంలో నడిపిన నరేంద్ర మోదీ.. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ అలాంటి ఘనతను సాధించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మరిన్ని వార్తలు