తమ్ముడు,చెల్లినే చూడనోడు రాష్ట్రాన్ని చూస్తాడా?

8 Apr, 2019 04:36 IST|Sakshi

మోసాలు, ముంచడమే చంద్రబాబు ప్రవృత్తి

వైఎస్సార్‌సీపీ నేత నార్నె శ్రీనివాసరావు విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: ‘‘28 ఏళ్లు దగ్గరగా చంద్రబాబును చూశాను. అతను ఎంత మోసగాడో చూశా. దేనికైనా తెగిస్తాడు. ప్రతిదాంట్లో కోవర్టులను పెడతాడు. తానే అన్ని చేస్తాడు. అతను కంపెనీకి సీఈవోగా మేనేజిమెంట్‌కు పనికివస్తాడు. పాలకుడిగా ప్రజలకు సీఎంగా పనికిరాడు. ఎక్కడ మోసం చేయవచ్చు... ఎక్కడ లాభం పొందవచ్చు.. ఎవరిని ఎక్కడ ముంచవచ్చు అనేది చంద్రబాబుకు బాగా తెలుసు’’ అని వైఎస్సార్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసి 600కుపైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయాడని, పరిపాలనలో పూర్తిగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారని విమర్శించారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలందరికీ చేరిందని, ఏపీ ప్రజలు జగన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు.

సొంతవాళ్లనే చూడనివాడు.. జనాన్ని ఏం చూస్తాడు?
సీఎం చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కానేకాదని నార్నె అన్నారు. సొంత తమ్ముడినే మోసం చేశాడన్నారు. రామ్మూర్తినాయుడు పరిస్థితి దారుణంగా ఉందని, నెలరోజులనుంచి నీ తమ్ముడిని చూపించమని అడుగుతున్నా స్పందన లేదన్నారు. 12 రోజులక్రితం సొంత చెల్లెలు తిరుపతిలో ప్రమాదం జరిగి దారుణ పరిస్థితి గడుపుతోందన్నారు. హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. చంద్రబాబుకానీ, ఆయన కొడుకు, భార్యకానీ ఆమెను పలకరించలేదని, కనీసం ఫోన్‌ కూడా చేయలేదని చెప్పారు. సొంత చెల్లిలిని చూడలేని వాడు రాష్ట్ర ప్రజలను ఎలా చూస్తాడో ప్రజలు అర్థం చేసుకోవచ్చన్నారు. లోకేష్‌ టెన్త్‌ పాస్‌ అవడనే భయంతో .. నారాయణ వాళ్లను పిలిచి చంద్రబాబు ఎలా పాస్‌ చేయించుకొన్నాడో తనకు తెలుసన్నారు. కేవలం టెన్త్‌లో పాస్‌ చేయించినందుకే... నారాయణకు చంద్రబాబు బాసట నిలిచి అంత ఉన్నతికి కారకుడయ్యాడన్నారు.

చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌కోసం కోఆపరేటివ్‌ డెయిరీలను మూయించారని విమర్శించారు. అమరావతిని ఏదో చేసేస్తానని చెబుతున్నాడని, కానీ అక్కడేమీ లేదన్నారు.  ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ కావాలని ప్రధాని మోదీతో మాట్లాడి.. ఆ మేరకు లబ్ధి పొందారని, ఇప్పుడు మాటమార్చి మోదీని తిడుతున్నారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుపడింది చంద్రబాబేనన్నారు. అమరావతిని జగన్‌ మాత్రమే పూర్తి చేస్తారన్నారు. హైదరాబాద్‌లో 60 లక్షల మంది సెటిలర్లు ఉన్నారని, ఇక్కడున్న ఏపీ, తెలంగాణ వారంతా అన్నదమ్ముల్లాగా హాయిగా బతుకుతున్నారని నార్నె అన్నారు. హాయిగా ఉన్న తెలుగువారి మధ్య చిచ్చుపెట్టాలని బాబు చూస్తున్నాడన్నారు. చంద్రబాబును ఇంటికి పంపిస్తే అక్కడ ఏపీ ప్రజలు, ఇక్కడ తెలంగాణ ప్రజలు సుఖంగా ఉంటారన్నారు.

మరిన్ని వార్తలు