ప్రభుత్వం హామీలను విస్మరించింది.. అందుకే నిరాహార దీక్ష

26 Dec, 2019 20:16 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నర్సారెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు రేపు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష చేపడతానని నర్సారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలు, డబుల్‌ బెడ్రూం నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై ప్రజలను మేల్కొల్పడానికి, ఇంకా అనేక సమస్యల సాధన కొరకు గజ్వేల్‌లో దీక్ష చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే నేను చేపట్టబోయే దీక్షకు ప్రభుత్వం అడ్డు తగులుతుందని ఆరోపించారు.

జిల్లాలో 30వ సెక‌్షన్‌ అనేది కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుందని, కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం చాలా రోజులుగా కొనసాగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ కోసం పగలకొట్టిన రోడ్లను మళ్లీ నిర్మించలేదని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రగతి భవన్‌, ఎర్రవల్లిలో సీఎం ఇంటి నిర్మాణం 6 నెలల్లోనే పూర్తి చేశారు..  మరి పేదలకు అందజేయాల్సిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎన్ని రోజులు కావాలంటూ నర్సారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు