‘రాహుల్‌ సావర్కర్‌’ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన

14 Dec, 2019 19:57 IST|Sakshi

న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ ‘రేపిన్‌ ఇండియా’ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. భేషరతుగా రాహుల్‌ జాతికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈక్రమంలో శనివారం జరిగిన కాంగ్రెస్‌ భారత్‌ బచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ క్షమాపణలు చెప్పే ‍ప్రసక్తే లేదని.. తాను ‘రాహుల్‌ సావర్కర్‌ను కాదు’ అని తేల్చి చెప్పాడు. అయితే, మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉన్న శివసేన రాహుల్‌ వ్యాఖ్యలపై స్పందించింది. హిందుత్వ పితామహుడు.. భరత జాతికి ఎనలేని సేవలు చేసిన వీర సావర్కర్‌ పేరును తక్కువ చేసి మాట్లాడొద్దని సూచించింది. 

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ మాదిరిగా వీర సావర్కర్‌ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని శివసేన ఎంపీ సంజయ్‌ రావత్‌ గుర్తు చేశారు. సావర్కర్‌ గౌరవానికి భంగం కలిచించే రీతిలో మాట్లాడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ట్విట్టర్‌ వేదికగా రావత్‌.. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ భారత దేశ మహనీయుడు. ఆయన కేవలం మహారాష్ట్రకే పరిమితం కాదు. జాతిపిత మహాత్మ గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ లాగే వీరసావర్కర్‌ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు’అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు