కన్నడ ఓటరు రూటే సెపరేటు

29 Mar, 2018 08:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అంచనాలకు అందరు. ఏ పార్టీని అక్కున చేర్చుకుంటారో, ఎవరిని అవాక్కు చేస్తారో ఊహించలేం.  తలపండిన రాజకీయ విశ్లేషకులకు సైతం వారి నాడి అంతుబట్టదు.  అందరి మూడ్‌ ఒకవైపు ఉంటే తమ రూటే సెపరేట్‌ అంటారు. కన్నడ ఓటరు శైలి ఎప్పుడూ విభిన్నమే. చరిత్ర చెబుతున్న సత్యమిది. ఒక్కసారి గత ఎన్నికల్ని పరిశీలిస్తే కన్నడిగుల నాడి పట్టుకోవడం కష్టమనే విషయం అర్థమవుతుంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు అందని విధంగానే కర్ణాటక ఓటర్లు తీర్పు చెప్పారు. మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉన్న ట్రెండ్‌కి  విరుద్ధంగా కన్నడ ఓటర్లు నడిచారు. ఒక్కసారి కన్నడనాట ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.

  • 1978వ సంవత్సరంలో దేశవ్యాపంగా ఇందిరాగాంధీకి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్న సమయంలో జనతా పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కొల్లగొడుతూ తన బలాన్ని పెంచుకుంటున్న దశలో కర్ణాటక  ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు.
  • 1983 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా తిరిగి పగ్గాలు చేపట్టడంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం వస్తే, అదే సంవత్సరం కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు కావడం అదే మొదటి సారి
  • 1984 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించి 414 స్థానాలను దక్కించుకున్న సమయంలో, కర్ణాటక ఓటర్లు కూడా అటువైపే మొగ్గు చూపించారు. 28 లోక్‌సభ స్థానాలకు గాను 24 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులనే గెలిపించారు. జనతా పార్టీ కేవలం నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏడాది 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఎవరి ఊహకూ అందని విధంగా తీర్పు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపించిన ఓటర్లు తమ విలక్షణత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో జనతా పార్టీని అందలం ఎక్కించారు.
  • 1989 సంవత్సరంలో బోఫోర్స్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్, అప్పటికే గ్రూపులుగా విడిపోయిన జనతా కుటుంబాన్ని ఏకం చేసి కాంగ్రెస్‌ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లో మట్టి కరిపిస్తే, ఇటు కర్ణాటక ఓటర్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. 
  • ఆ తర్వాత కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, ఇటు కర్ణాటక అసెంబ్లీకి 1994 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్‌ పార్టీకి పట్టంకట్టారు. అప్పుడే దేవెగౌడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోనూ ఎదిగారు. 
  • 1999 సంవత్సరం లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం గద్దెనెక్కితే , అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. అప్పట్లో ప్రధానమంత్రిగా వాజపేయి ఉంటే, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్‌ఎం కృష్ణ అయిదేళ్లు రాష్ట్రాన్ని పాలించారు. 
  • 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అటు వాజపేయి, ఇటు ఎస్‌ఎం కృష్ణ ఇద్దరూ అధికారాన్ని కోల్పోయారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే,  కన్నడ ఓటర్లు దానికి విరుద్ధంగా బీజేపీ, జేడీ(ఎస్‌)ని గెలిపించారు. 
  • 2008 సంవత్సరంలో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కన్నడ ఓటరు మళ్లీ బీజేపీ వైపే మొగ్గు చూపించారు. ఆ తర్వాత ఏడాదికే 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం మళ్లీ కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. 
  • 2013–14 సంవత్సరంలో కూడా కేంద్ర రాష్ట్రాలలో భిన్నమైన పరిస్థితి కొనసాగింది.  2013 అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ఓటరు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కడితే, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. 

ఇలా కన్నడ ఓటరు ప్రతీసారి సంప్రదాయ ఓటు బ్యాంకు సూత్రాలకు, రాజకీయ వ్యూహాలకు అతీతంగానే నడుస్తూ వస్తున్నాడు. 

-- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు