ఈవీఎంల పని తీరు సరిగా లేదు : ఒమర్‌ అబ్దుల్లా

11 Apr, 2019 15:47 IST|Sakshi

శ్రీనగర్‌ : దేశ వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ ‍ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో ఐదేళ్ల పాటు తమ భవిష్యత్తును నిర్ణయించే నేతలను ఎన్నుకునేందుకు ప్రజలంతా పోలింగ్‌ సెంటర్ల ముందు బారులు తీరారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీఎంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల గుర్తు బటన్‌ పని చేయడం లేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో పలు పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలలో కాంగ్రెస్‌ బటన్‌ పని చేయలేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో స్థానిక మీడియాలో ప్రసారం అయిన వార్తను ఆయన తన ట్వీటర్‌లో షేర్‌ చేశారు.

ఈ సంఘటన షాపూర్‌ పోలింగ్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. వీడియోలో పోలింగ్‌ అధికారి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘ఈవీఎంలోని 4వ నంబర్‌ హస్తం గుర్తు బటన్‌ పని చేయడం లేదు. ఈ కారణంగా పోలింగ్‌కు ఆలస్యం అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బటన్‌ పని చేయకపోవడానికి గల కారణాలు తెలియదు’ అని పేర్కొన్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో ఇదే సమస్య తలెత్తిందని ఓటర్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో పూంచ్‌ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన జుగల్‌ కిషోర్‌ విజయం సాధించాడు. ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

మరిన్ని వార్తలు