ప్రతిపక్షాలు పాక్‌ ప్రతినిధులు

3 Apr, 2019 04:08 IST|Sakshi
గయలో నిర్వహించిన ర్యాలీలో మోదీ, నితీశ్‌ కుమార్, పాశ్వాన్‌ అభివాదం

బాలాకోట్‌ దాడికి రుజువులు కోరడంపై ప్రధాని మోదీ ఆగ్రహం

జముయ్‌(బిహార్‌): బాలాకోట్‌ ఉగ్రశిబిరాలపై ఐఏఎఫ్‌ దాడికి రుజువులు చూపాలంటూ డిమాండ్‌ చేస్తున్న ప్రతిపక్షాలు భారతీయ రాజకీయ పార్టీల కంటే మించి పాక్‌ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. బిహార్‌లోని జముయ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన కాంగ్రెస్, ఆర్‌జేడీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ‘పాక్‌కు సాయపడేవారు, ఆధారాలు చూపాలంటూ మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే వారు కావాలో వద్దో తేల్చాల్సింది ప్రజలే’ అని తెలిపారు.

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రధాని పదవిని పునరుద్ధరించాలన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. ‘ఏ దేశంలోనైనా ఒకరి కంటే ఎక్కువమంది ప్రధానులుంటారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో మహాకూటమి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఆర్‌జేడీలు తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ‘కాంగ్రెస్‌ తన సొంతంగా లేదా కూటమి పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారీ దేశంలో పాలన తిరోగమనంలో సాగుతుంది. అభివృద్ధి పడిపోతుంది.

హింస, ఉగ్రచర్యలు, నల్లధనం పేరుకుపోవడం మితిమీరుతాయి’ అని ఆరోపించారు. సోషలిస్ట్‌ నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ పేరుతో పదవీ ప్రమాణం చేసే లాలూ ప్రసాద్‌ వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌ చంకనెక్కారు అంటూ ఎద్దేవా చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అనుసరిస్తున్న బీజేపీ దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆర్‌జేడీ ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన మా ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీల రిజర్వేషన్ల జోలికి పోలేదు’ అని వివరించారు.

ప్రతిపక్షాల నుంచి అవరోధాలు ఎదురైనప్పటికీ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినట్లు తెలిపారు. ‘రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జీవించి ఉన్న కాలంలో ఆయన్ను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఆయనంటే ఎంతో అభిమానం ఉన్నట్లు నటిస్తోంది. మా ప్రభుత్వం అంబేడ్కర్‌ సేవలను గుర్తిస్తూ భారతరత్న ప్రకటించింది. ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాలను తీర్థయాత్రా స్థలాలుగా గుర్తించి, అభివృద్ధి చేస్తోంది’ అని తెలిపారు. ప్రసంగం చివరలో ఆయన ‘మై భీ చౌకీదార్‌’ అంటూ ప్రజలతో నినాదం చేయించారు.  
 

మరిన్ని వార్తలు