ఎంత మంది ముస్లింలకు ‘భారతరత్న’ ఇచ్చారు: ఒవైసీ

28 Jan, 2019 11:29 IST|Sakshi

ముంబై : భారత అత్యున్నత పౌరపురస్కారమైన ‘భారతరత్న’ను ఇప్పటి వరకు ఎంతమంది ముస్లింలు, దళితులు, ఆదివాసీలకు ఇచ్చారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. దళితుల ఐకాన్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు కూడా భారతరత్న అవార్డును హృదయపూర్వకంగా ఇవ్వలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహారాష్ట్రలో ఓ సభలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారో చెప్పాలని ఒవైసీ కేంద్రాన్ని నిలదీశారు. తప్పని పరిస్థితుల్లో అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డును ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత రత్న అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అత్యున్నత పురస్కారాల ప్రకటన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: ప్రణబ్‌దా భారతరత్న)

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా సైతం ఈ అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును అందించలేదని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా సన్యాసులకు ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాలని కేంద్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇక కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే సైతం భారతరత్న అవార్డుల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సేవకుడు శివకుమార స్వామికి భారత రత్న ఇవ్వకుండా ఓ గాయకుడికి (హజారికా), ఆరెస్సెస్‌ సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన వ్యక్తి (నానాజీ దేశ్‌ముఖ్‌)కు అవార్డు ఇచ్చారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారాన్నిసృష్టించాయి. కర్ణాటక ప్రభుత్వం సైతం శివకుమార స్వామికి భారత రత్న ప్రకటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. (చదవండి: ‘సన్యాసులకు భారతరత్న ఇవ్వాలి’)

మరిన్ని వార్తలు