మంత్రులు.. మరో ఇద్దరు!

19 Feb, 2019 06:37 IST|Sakshi

కేసీఆర్‌ కేబినెట్‌లో తలసాని, మల్లారెడ్డికి స్థానం

విధేయత, సమర్థత కోణంలో అమాత్యుల ఎంపిక

ఇప్పటికే కీలకమైన హోంశాఖకు మహమూద్‌ అలీ

పద్మారావుకు డిప్యూటీ స్పీకర్‌ పదవి?

సాక్షి, సిటీబ్యూరో: కేసీఆర్‌ కేబినెట్‌లో జంట జిల్లాల నుంచి మరో ఇద్దరు నేతలు మంత్రి పదవులు చేపట్టనున్నారు. ఇందులో హైదరాబాద్‌ జిల్లా కోటాలోసనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మంగళవారం రాష్ట్ర మంత్రులుగాబాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు సోమవారం సాయంత్రంఇద్దరు నేతలకు  సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది.  ఇప్పటికే నగరం నుంచి ఎమ్మెల్సీ మహమూద్‌ అలీ కేబినెట్‌లో కీలకమైన హోంశాఖను నిర్వహిస్తుండగా...కొత్తగా మరో ఇద్దరికి స్థానం కల్పించాలని నిర్ణయించారు. కేసీఆర్‌ గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే టి.పద్మారావులకు ఈమారు చోటు దక్కలేదని తెలుస్తోంది. పద్మారావుకు కేబినెట్‌ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్‌ పదవి కట్టబెడతారని సమాచారం.

విధేయత, సమర్థతలకు చోటు  
రాష్ట్ర మంత్రివర్గంలో విధేయతతో పాటు సమర్థత, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. సనత్‌నగర్‌ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీనివాస యాదవ్‌ను వరుసగా రెండవ మారు కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించారు. అందరూ ఊహించినట్లుగా జరగడంతో తలసాని స్థానంపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి చామకూర మల్లారెడ్డి పేరు సాయంత్రానికి అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. మల్లారెడ్డి సైతం సోమవారం ఉదయం అర్కల్‌గూడలో విలేకరులతో మాట్లాడుతూ, తనకు రెండవ విడతలో మంత్రి పదవి లభిస్తుందని చెప్పుకొచ్చారు. సాయంత్రానికి మాత్రం ప్రగతిభవన్‌ నుంచి పిలుపు రావటంతో  హుటాహుటిన సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. వాస్తవానికి ఎంపీగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించిన మల్లారెడ్డికి ఏదో ఒక కీలక పదవి అప్పగిస్తారని భావించారు. ఐతే నగరం నుండి నాయిని నర్సింహారెడ్డికి స్థానం లేకపోవటంతో సామాజిక కోణంలో ఈ స్థానాన్ని మల్లారెడ్డితో భర్తీ చేసేందుకు నిర్ణయించి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పద్మారావు మనస్తాపం!
రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కలేదని తెలిసి సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే టి.పద్మారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తనకు కాకుండా టీడీపీ అభ్యర్థిగా తనతో పలుమార్లు తలపడిన శ్రీనివాసయాదవ్‌కు స్థానం కల్పించటంపై పద్మారావు ఒకింత నొచ్చుకున్నట్లు తెలిసింది. తలసానికి ఇవ్వటంపై తనకు అభ్యంతరం లేదని, అదే సమయంలో తనకు కూడా ఇస్తే సరైన గౌరవం ఉంటుందన్న అభిప్రాయాన్ని పద్మారావు పార్టీ ముఖ్యనేతల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు