పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదు: పల్లె

15 Mar, 2018 09:50 IST|Sakshi
పల్లె రఘునాథ రెడ్డి (ఫైల్‌)

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదని ఆయన విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు తమతో ఉంటూ అకస్మాత్తుగా టీడీపీపై విమర్శలు చేయడం అనుమానాలనకు దారితీస్తోందని అన్నారు. పవన్‌ వెనుక బీజేపీ హస్తం ఉండచ్చొని, పవన్‌ను బీజేపీ ఒక పావులా వాడుకుంటుందని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చాడు కాబట్టే ఆయన సలహాలను పరిగణలోకి తీసుకున్నామని పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శేఖర్‌ రెడ్డి కేసులో లోకేశ్‌ హస్తం ఉందని పవన్‌ ఆరోపించడం అర్థం లేనిదనీ, ఇంతవరకు శేఖర్‌రెడ్డిని లోకేశ్‌ చూడలేదనీ తెలిపారు. శేఖర్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారని తెలిపారు.  ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అర్థరహితమని పేర్కొన్నారు.  పవన్‌ పరిణతి చెందిన నాయకుడిగా వ్యవహరించడం లేదని పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. లోకేశ్‌పై పవన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ చేస్తున్న అవినీతి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసే పనులకు ఎన్టీఆర్‌ ఆత్మ పడే క్షోభ అంతా ఇంతా కాదంటూ పవన్‌ కల్యాణ్‌... జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు