మైనారిటీలతో అనుబంధం మరువలేం

1 Apr, 2019 12:23 IST|Sakshi
పుంగనూరులో ముస్లిం మహిళలతో ర్యాలీలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బీజేపీతో పొత్తు ప్రసక్తే ఉండదు

ఆ పార్టీతో టీడీపీకే దోస్తీ

ముస్లిం మైనారిటీలతో పెద్దిరెడ్డి

చిత్తూరు, పుంగనూరు : ‘ముస్లిం మైనారిటీలతో మా అనుబంధం మరువలేనిది... మా అభ్యున్నతికి ముస్లింలు చేస్తున్న కృషికి మేము ఏమి చేసినా రుణం తీర్చుకోలేం...బీజీపీతో వైఎస్సార్‌సీపీకి ఎటువంటి పొత్తు ఉండదు. ముస్లింలతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి దాకా  ఎంతో అనుబంధం ఉంది. టీడీపీకే బీజేపీతో దోస్తీ’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఖాదర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో అయూబ్‌ఖాన్, ఇంతియాజ్‌ఖాన్, రహత్‌జాన్, నయీమా కలసి ఆదివారం రాత్రి ముస్లిం మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. తరువాత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముస్లింలు ఎంతో ఆత్మాభిమానంతో జీవిస్తారని కొనియాడారు. పేదరికంలో ఉన్నా ఏనాడు అది వెల్లడికాకుండా జీవిస్తున్న ముస్లింలు అభినందనీయులన్నారు.

ముస్లింల అభ్యున్నతికి నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డిదేనని కొనియాడారు. రిజర్వేషన్‌ ఫలితంగా వందలాది మంది ముస్లింలు ఎన్నో ఉన్నత చదువులు చదివి, దేశ విదేశాలలో స్థిరపడ్డారని తెలిపారు. ముస్లింల కోసం టీడీపీ ప్రభుత్వం ఏనాడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. ముస్లింలను అభివృద్ధి చేయాల్సిన టీడీపీ ప్రభుత్వం వారిని అన్ని విధాలా నిర్లక్ష్యానికి గురిచేసిందని ఆరోపించారు. ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలు సమీపిస్తుంటే ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చి, ఓట్ల కోసం ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింలకు తగిన గుర్తింపు ఇచ్చి, ఎన్నికల్లో పోటీకి దింపారని తెలిపారు. వైఎస్సార్‌సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు తగిన సీట్లు కేటా యించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు ఎన్నికల కోసం నవరత్నాలను కాపీకొట్టి, ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని, ఆ మాటలు నమ్మి మోసపోవద్దని ముస్లింలను కోరారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, మునిసిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్దీన్‌ షరీఫ్, పట్టణ అధ్యక్షుడు ఇఫ్తికార్, కౌన్సిలర్లు ఆసిఫ్, అమ్ము, రేష్మా, మంజుల, కో–ఆప్షన్‌ మెంబర్‌ ఎంఎస్‌.సలీం, పార్టీ  మైనారిటీల విభాగం నాయకులు అజీజ్,  కిజర్‌ఖాన్, నూర్, ఇర్ఫాన్, అంజాద్, మహిళా విభాగం నాయకులు తులసెమ్మ, సల్మా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు