ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..

18 Mar, 2020 12:25 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంలో స్థానిక సంస్థలు కీలకమని ఆయన అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘అధికారులకు తోడు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఉంటే కరోనాను మరింతగా కట్టడి చేయొచ్చు. టీడీపీ తన ఉనికి కోల్పోతుందని చంద్రబాబు కుట్రలు పన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశారు. రూ.60వేల కోట్ల బకాయిలను చెల్లించలేదు.

బాబు చెప్పినట్లు రమేష్‌ కుమార్‌ వింటాడు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 9 నెలల్లోనే నెరవేర్చారు. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడాన్ని చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. నీరు-చెట్టు పథకం ద్వారా చంద్రబాబు వేలకోట్లు దోచుకున్నారు. ఆయన ఇంకా తాను సీఎంనని భావిస్తున్నారు. సీఎం జగన్‌ తలచుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో చంద్రబాబుకు చాలా సంబంధాలు ఉన్నాయి. వాళ్లిద్దరూ ఒకే యూనివర్శిటీలో చదువుకున్నారు. రమేష్‌ కుమార్‌కు ఉద్యోగం విషయంలో బాబు సాయం చేశారు. ఎన్నికల వాయిదాకు చంద్రబాబే కారణం. ఆయన చెప్పినట్లు రమేష్‌ కుమార్‌ వింటాడు. చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నాడు. (‘చంద్రబాబు స్పీచ్‌నే లేఖగా రాశారు’)

తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి
నిజాయితీ గల ఐఏఎస్‌ అధికారి బాబూరావు. మొదట ఆయనను చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా వేశారు. అయితే చంద్రబాబు జోక్యంతో బాబూరావు స్థానంలో సిద్ధార్థ జైన్‌ను నియమించారు. చంద్రబాబుకు సిద్ధార్థ జైన్‌ నీడలాంటివాడు. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబులా మేం అడ్డదారులు తొక్కలేదు. ఇప్పటికైనా రమేష్‌ కుమార్‌ పునరాలోచించుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి’ అని డిమాండ్‌ చేశారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: పెద్దిరెడ్డి)

మరిన్ని వార్తలు