-

ఒక్క బ్రిడ్జ్‌.. నాలుగు ఎన్నికలు

1 Nov, 2018 03:31 IST|Sakshi

ఎన్నికల్లో అదిచేస్తాం.. ఇదిచేస్తాం అంటూ హామీలివ్వడం. గెలిచిన తర్వాత చేతులెత్తేయడం సర్వసాధారణమే. అలాంటిదే ఓ అంశం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌ నియోజకవర్గంలో (జిల్లా కేంద్రం) ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తోంది. ఈ పట్టణంలో చాలా రద్దీగా ఉండే ఓ కూడలిలో ఓవర్‌ బ్రిడ్జ్‌ అత్యంత ఆవశ్యకం. ఇది ఈనాటి సమస్యేం కాదు. 20 ఏళ్లుగా స్థానిక ప్రజల డిమాండ్‌ అది. అయితే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి గెలిస్తే ఓవర్‌ బ్రిడ్జ్‌ కట్టి తీరతామంటూ ప్రతిసారీ ఒకే వాగ్దానం చేస్తున్నారు.

గెలిచాక ఆ బ్రిడ్జ్‌ మాటే ఎత్తడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు. మిగిలిన పనులు జరుగుతున్నా.. ఓవర్‌ బ్రిడ్జ్‌ విషయంపై మాత్రం బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావడం లేదని వారంటున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని వారంటున్న నేపథ్యంలో.. ఈసారి ఓవర్‌బ్రిడ్జ్‌ అంశంపై ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తలు