ఆశ.. శ్వాస నువ్వే

8 Feb, 2018 07:16 IST|Sakshi

ప్రజా సంకల్ప యాత్రలో అడుగడుగునా వినతుల వెల్లువ

మీరే దిక్కని జననేతకు వేడుకోలు

1100 కి.మీ మైలు రాయిని అధిగమించిన యాత్ర  

గుర్తుగా మొక్క నాటిన జగన్‌మోహన్‌ రెడ్డి  

బంద్‌కు మద్దతుగా నేడు విరామం

సాక్షిప్రతినిధి, నెల్లూరు: ‘‘అన్నా నీవు.. సీఎం అయి మా కష్టాలు తీర్చాలి. అనేక ఏళ్లుగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ పాలకులకు మాగోడు పట్టలేదు. కనీసం మీ సమస్య ఏంటని అడిగిన నాథుడే లేడన్నా.. మొదటిసారిగా నీవే మా పల్లెకు వచ్చావు. మా బాధలు ఆసాంతం విని మాలో భరోసా నింపావు. అయ్యా.. గిరిజనులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కనీసం రేషన్‌కార్డు కూడా మంజూరు చేయడంలేదు’’ అని గిరిజన దంపతుల గోడు. ‘‘ఆడపిల్లలకు ఉద్యోగాలు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలను ప్రభుత్వం అమలుచేయకపోవడం వల్ల చదువుకుని కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం’’ అంటూ ఓ యువతి ఆవేదన.

‘‘ఉపాధి పనులు లేక ఓవైపు.. చేసిన పనులకు డబ్బులు రాక మరోవైపు చిక్కి శల్యం అవుతున్నాం’’అనిమహిళా కూలీల కన్నీళ్లు.. ఇలా దారిపొడవునా వినతులే. జననేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు జనం ప్రభంజనమై ఓవైపు పోటెత్తగా మరోవైపు అడుగడుగునా కష్టాలతో కూడిన వినతులు ఇస్తున్న ప్రజానీకం జననేత భరోసాతో మనోధైర్యం పొందుతున్నారు. బుధవారం ప్రజా సంకల్పయాత్ర ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలో ప్రారంభమై ఎఎస్‌పేట మండలం మీదుగా దుండిగం క్రాస్‌లోకి ప్రవేశించింది. జననేత 15.2 కి.మీ ప్రజాసంకల్పయాత్ర కొనసాగించారు.

యాత్ర సాగిందిలా..
బుధవారం ఉదయం సంగం మండలంలోని సంగం క్రాస్‌రోడ్డు వద్ద ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైం ది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఘనస్వాగతం పలికి కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అనంతరం అక్కడ నుంచి తలుపులూరు పాడు క్రాస్‌రోడ్డు చేరుకున్న జననేతకు ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ షేక్‌ నన్నేబి అనే మహిళ జననేతను కలిసి గోడు వెళ్లబోసుకుంది. కాళ్లు సక్రమంగా పనిచేయని తనకు గుండెజబ్బు ఉందని.. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అదే సెంటర్‌లో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన మహబూబ్, సుప్రీం, రవి, బాలాజీ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి హజ్‌యాత్రనుంచి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందజేశారు. అక్కడి నుంచి కొరిమెర్ల క్రాస్‌ చేరుకున్న జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. 1100కి.మీ పాదయాత్ర మైలురాయిని అధిగమించినందుకు గుర్తుగా అక్కడ జగన్‌ మొక్క నాటారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా అక్కడ గిరిజన దంపతులు శ్రీనయ్య, పద్మ జగన్‌మోహన్‌ రెడ్డిని కలసి నాలుగేళ్లుగా తిరుగుతున్నా తమ కు రేషన్‌కార్డు రాలేదని, గిరిజనుల సంక్షేమాన్ని పాలకులు విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు.

అక్కడే 9వ తరగతి విద్యార్థిని జి.అనూష, గృహిణి బండి మనోజ జననేతను కలసి ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు సరిగా లేవని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడం లేదని, ప్రత్యేక హోదాతోనే అన్ని విషయాలు మెరుగవుతాయని విన్నవించారు. అనంతరం అక్కడ మామిడి రైతులు బి.రఘురామిరెడ్డి, నంది హజరత్‌రెడ్డి జగన్‌ను కలిసి తమకు సబ్సిడీ తక్కువ ఇస్తున్నారని ఎక్కువ సబ్సిడీ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే కావలి యడవల్లి గ్రామానికి చెందిన కలిగిరి రాగమ్మ జననేతను కలిసి తన కుమారుడు మృతిచెందాడని, తన కోడలుకు వితంతు పింఛను అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడే సంగం మండలం నీలాయపాళెం గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు మస్తాన్‌బీ, హుస్సేన్‌బీతో పాటు పలువురు జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమకు ఉపాధి పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

అక్కడ నుంచి కొండారెడ్డితోట సెంటర్‌కు చేరుకున్న జగన్‌ను కొం డేటి హజరతమ్మ కలిసి తనకు వృద్ధాప్య పింఛను ఇవ్వడం లేదని, తనకు ఎలాంటి ఆసరా లేదని ఆవేదన వ్యక్తంచేసింది. అనంతరం అక్కడ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన కౌలు రైతులు షేక్‌ మొయిద్దీన్, సతీష్‌ జననేత జగన్‌ను కలిశారు. ఇక్కడ 100 ఎకరాల భూమిని కౌలు తీసుకుని శనగపంట వేస్తే పూర్తిగా నష్టపోయామని ఈ ప్రభుత్వం తమను ఏవిధంగానూ ఆదుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి హసనాపురం శివారుల్లో మధ్యాహ్న భోజన శిబిరానికి చేరుకున్నారు. అక్కడ వీఆర్‌ఏలు, ఆర్‌ఎంపీ డాక్టర్లు, ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ నేతలు, వికలాంగుల హక్కుల పోరాట సమితి తదితర సంఘాల నేతలు వినతిపత్రాలను అందజేశా రు. అక్కడ నుంచి హసనాపురంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జననేత పా ల్గొని  ప్రసంగించారు. ఈసందర్భంగా ముస్లింలు ఆయనను సంప్రదాయ రీతిలో సత్కరించారు.

అక్కడ నుంచి హసనాపురం ప్రధాన సెంటర్‌ చేరుకున్న జగన్‌కు ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం జు వ్వలగుంటపల్లి్ల చేరుకున్న అభిమాన నేతకు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. బొమ్మిశెట్టి కృష్ణకుమారి అనే చేనేత కార్మికురాలు తాను స్వయంగా సిద్ధం చేసిన నేత చీరను జననేతకు అందించి నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని, కనీస గిట్టుబాటు ధర కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది.  పార్టీ రాష్ట్ర తెలంగాణా నేత కొండా రాఘవరెడ్డి జననేతను కలిసి సమ్మక్క, సారక్క ప్రసాదం అందజేశారు. బీటెక్‌ విద్యార్థులు స్వాతి, లహరీ, నౌషాదు జననేతను కలిసి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం సక్రమంగా అమలుకావడం లేదని తెలిపారు. గురువారం జరగనున్న రాష్ట్ర బంద్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్ద తు ప్రకటించింది. దీనిలో భాగంగా జననేత బంద్‌కు సంఘీభావంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు.

ముఖ్యనేతలు హాజరు
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,  నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధనరెడ్డి, కిలివేటి సం జీవయ్య, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి,  పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్పయాత్ర కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళి, పార్టీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి,  బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలజా చరణ్‌రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు