దారులన్నీ జనఏరులు

16 Apr, 2018 07:42 IST|Sakshi
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గం అంబాపురంలో జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి నడుస్తున్న జన సందోహంలో ఓ భాగం

జననేత రాకతో పులకించిన  పల్లెసీమలు

కష్టజీవుల కన్నీళ్లు చూసి చలించిన జగన్‌

కుమ్మరుల కష్టాన్ని కళ్లారా వీక్షించి కదిలిపోయారు

గీత కార్మికుల దైన్యాన్నితెలుసుకుని తల్లడిల్లారు

అవ్వా తాతల ఆవేదన విని హృదయం ద్రవించింది

డ్వాక్రా మహిళల గోడు ఆలకించి చలించిపోయారు

కర్షకుల కష్టాలు తెలుసుకుని  నోటమాటరాలేదు

పెద్దకొడుకుగా ఆదుకుంటానని  అందరికీ భరోసా

జననేతకు మద్దతుగా దారులన్నీ జన ఏరులవుతున్నాయి... అన్ని వర్గాలు మేము సైతం అంటూ ప్రజాసంకల్ప యాత్రలో మమేకమవుతున్నాయి... ఓ మహోద్యమంలో భాగస్వాములవుతున్నట్టు ఆనందభరితులవుతున్నాయి.. ఆత్మ బంధువే వచ్చాడంటూ రాజన్న బిడ్డ వెన్నంటి నడుస్తున్నాయి...     మా వెతలు తీర్చే నేతవంటూ జననేతకు  జేజేలు పలుకుతున్నాయి... మిము వీడబోమని, మీ వెంటే మేమని బాస చేస్తున్నాయి  మీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నాయి..... ఆరోగ్యం జాగ్రత్త అంటూ ‘రక్ష’ కడుతున్నాయి. ఆశయ సిద్ధిని కాంక్షిస్తూ హారతులు పడుతున్నాయి. మరో వైపు జనం సమస్యలు వింటూ.. బాధితులకు భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు జననేత       వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

సాక్షి, అమరావతిబ్యూరో : రాజన్న బిడ్డ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పాదయాత్రలో పల్లె ప్రజలతో   మమేకం అయ్యారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలు అయిన కులవృత్తులవారిని కలుసుకున్నారు.వై.ఎస్‌.జగన్‌  ప్రజాసంకల్ప యాత్ర 137వ రోజు పాదయాత్రను విజయవాడ రూరల్‌ మండలం వైఎస్సార్‌ కాలనీలో ఉదయం 8గంటలకు ప్రారంభించారు. అక్కడ నుంచి అంబాపురం, జక్కంపూడి కొత్తూరు తాడేపల్లి, కొత్తూరు, వెలగలేరు, ముత్యాలంపాడు క్రాస్‌ వరకు కొనసాగించారు. వై.ఎస్‌.జగన్‌ ఆదివారం 14.40 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. గీత కార్మికులు వచ్చి జననేతకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం ప్రకృతి విధ్వంసకర విధానాల వల్ల ఈత, తాటి చెట్లు కనుమరుగైపోతున్నాయని గీత కార్మికుల ప్రతినిధి రాజేషం గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వై.ఎస్‌.జగన్‌ స్పందిస్తూ  తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గీత కార్మికుల వృత్తిని పరిరక్షించే విధానాలు రూపొందిస్తామని చెప్పారు.

మట్టిపై హక్కు కల్పిస్తామని హామీ...
 కె.తాడేపల్లి వద్ద విద్యాధరపురం శాలివాహన సంఘం ప్రతినిధులు  వై.ఎస్‌.జగన్‌ను కలిశారు. వారి కోరికపై కుమ్మరి చక్రాన్ని వై.ఎస్‌.జగన్‌ తిప్పారు. కుమ్మరి వృత్తిని కాపాడేందుకు మట్టిపై హక్కు కల్పించాలని శాలివాహన సంఘం ప్రతినిధులు దుర్గా ప్రసాద్, వీర్రాజు, ఏడుకొండలు ఆయన్ని కోరారు. అక్కడ ఉన్న 200 కుమ్మరి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 ఎకరాలు కేటాయించాలని  విజ్ఞప్తి చేశారు. వై.ఎస్‌.జగన్‌ స్పందిస్తూ కుమ్మరి కుటుంబాలకు మట్టిపై చట్టబద్ధమైన హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డెల్టా రైతులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సాగునీటి కష్టాలను వివరించారు. నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో కూడా సాగునీరు అందడం లేదని వాపోయారు. కృష్ణమ్మ చెంతనే ఉన్నా సరే సాగునీరుకు ఇక్కట్లు పడుతుండటం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శమని వై.ఎస్‌.జగన్‌ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దివంగత మహానేత స్ఫూర్తితో కృష్ణా జిల్లా అంతటికీ సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తికి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

భారీగా తరలివచ్చిన మహిళలు...యువతీ యువకులు....
జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి పల్లె సీమలు ఆత్మీయస్వాగతం పలికాయి.  విజయవాడ రూరల్‌ మండలం వైఎస్సార్‌ కాలనీ నుంచి పాదయాత్ర ముగించిన ముత్యాలంపాడు క్రాస్‌ వరకు దారిపొడవునా రోడ్లకు ఇరువైపులా వేచి చూశారు. అంబాపురం వద్ద గ్రామీణ మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. వై.ఎస్‌.జగన్‌ను చూసి ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఆయనతో కరచాలనాలు చేసేందుకు పోటీపడ్డారు. కొత్తూరు తాడేపల్లి వద్ద కుమ్మరి కుటుంబాల మహిళలు, యువత జననేత కోసం ఉదయం నుంచే ఆతృతగా ఎదురు చూశారు. ఆయన రాగానే హారతులిచ్చి రాఖీలు కట్టారు. కొత్తూరు, వెలగలేరుల వద్ద వై.ఎస్‌.జగన్‌ అవ్వాతాతలను కలుసుకున్నారు. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాన్నలా మంచి పేరు తెచ్చుకోవాలని వారు ఆయన్ని ఆశీర్వదించారు. మండుటెండలో అంతులేని శ్రమను లెక్కచేయకుండా తమ కోసం పాదయాత్ర చేస్తున్న ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇలా వై.ఎస్‌.జగన్‌ ఆసాంతం పల్లె జనం ఆత్మీయతవర్షంలో తడిసి ముద్దయ్యారు.

రాష్ట్ర బంద్‌కు మద్దతు... నేడు పాదయాత్రకు విరామం
రాష్ట్ర బంద్‌ సందర్భంగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర బంద్‌కు నిర్వహించనున్నారు. అందుకే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. మైలవరం నియోజకవర్గం బి.కొండూరు మండలం ముత్యాలంపాడు క్రాస్‌ నుంచి మంగళవారం ఉదయం 138 వరోజు పాదయాత్ర ప్రారంభిస్తారు.

పాదయాత్రలో పాల్గొన్న నేతలు
ప్రజా సంకల్ప యాత్రలో ఆదివారం వైఎస్సార్‌ సీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి జోగి రమేష్‌తో పాటు విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మచిలీపట్నం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కె. పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజకుమార్, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పార్టీ నేతలు దుట్టా రామచంద్రరావు, కైలే అనిల్‌కుమార్, యార్లగడ్డ వెంకట్రావు, పి. గౌతమ్‌రెడ్డి,,  జి.కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, జెడ్పీటీసీ సభ్యుడు కాజా బ్రహ్మయ్య, తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి, ఆగిరిపల్లి జెడ్పీపీటీసీ సభ్యుడు కాజా రాంబాబు, మొండితోక అరుణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు