మోదీ–రాహుల్‌ ప్రచార మారథాన్‌

19 May, 2019 00:15 IST|Sakshi

51 రోజులు ... ర్యాలీలూ, రోడ్డుషోలు...

మోదీ: 144,  రాహుల్‌: 128

మూడోవంతు యూపీ, పశ్చిమబెంగాల్‌లోనే ప్రచారం  

ప్రపంచంలోనే భారీ ఎన్నికల్లో ప్రచారం కూడా అదే తారస్థాయిలో సాగింది. ఈసారి ‘అబ్‌కీబార్‌ 300 పార్‌’’ నినాదంతో తన చివరి ప్రచార యాత్రను శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో ముగించిన నరేంద్రమోదీ ఎన్నికల మారథాన్‌ 51 రోజుల్లో 144 ర్యాలీలూ, రోడ్డుషోలతో సుదీర్ఘ సంచలనంగా సాగింది. మార్చి 28న ప్రారంభమైన మోదీ ప్రచారం మూడొంతులు రెండు రాష్ట్రాల్లోనే వెచ్చించడం విశేషం. యూపీ, పశ్చిమబెంగాల్‌లలోనే మోదీ మూడొంతుల ప్రచారం సాగడం యాదృచ్ఛికం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 25 రాష్ట్రాలూ, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 1,05,000 కిలోమీటర్లు మోదీ ప్రయాణించగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 23 రాష్ట్రాలూ, రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 128 బహిరంగసభల్లో పాల్గొన్నారు.  

రాహుల్‌ కంటే 16 సభలు ఎక్కువగా పాల్గొన్న మోదీ!
మార్చి 28న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మోదీ తొలిసారిగా ఈ ఎన్నికల ప్రచారఅంకాన్ని ప్రారంభించి ఈ శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో ప్రచారాన్ని ముగించే సరికి 144 ర్యాలీలూ, రోడ్డుషోల్లో్లనూ మోదీ పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ కంటే అధికంగా 16 సభల్లో మోదీ పాల్గొన్నారు. అయితే ఈ రెండు ప్రధాన పార్టీల అధినేతలూ అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీలోనే అత్యధిక సభల్లో పాల్గొనడం గమనార్హం.  

మోదీ ప్రచార హోరు...
మధ్యప్రదేశ్‌లో ఈ శుక్రవారం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే సరికి మోదీ మొత్తం 1.5 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం కాంగ్రెస్‌ అధికారపగ్గాలు చేపట్టిన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లపైనే మోదీ దృష్టి అంతా కేంద్రకీరించారు. రాజస్థాన్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 9 ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల పర్వంలో పశ్చిమ యూపీలో తొలి నాలుగు దశల్లో కలిపి యూపీలో మొత్తం 11 ర్యాలీల్లో పాల్గొంటే,  చివరి మూడు దశల్లో  అన్ని రాష్ట్రాలకంటే అధికంగా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 18 ఎన్నికల ర్యాలీల్లో మోదీ పాల్గొని రికార్డు సృష్టించారు.

దేశంలోనే అత్యధిక(80) లోక్‌సభ స్థానాలున్న యూపీలో మొత్తం అన్ని దశల్లో కలిపి 29 ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ కేంద్రీకరించిన మరో రాష్ట్రం పశ్చిమబెంగాలే. యూపీ తరువాత 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్‌లో గెలుపుకోసం అహరహం శ్రమించిన ప్రధాని నరేంద్రమోదీ 17 ర్యాలీల్లో పాల్గొని మమతా బెనర్జీ కోటలో ప్రకంపనలు సృష్టించారు. 40, 48 సీట్లున్న పెద్ద రాష్ట్రాలైన బిహార్‌లో 10 ర్యాలీల్లోనూ, మహారాష్ట్రలో 9 రాష్ట్రాల్లోనూ మోదీ ప్రచారంలో పాల్గొన్నారు. నితీష్‌ కుమార్‌ సారథ్యంలోని జనతాదళ్‌(యూ), శివసేనలో పొత్తు నేపథ్యంలో మోదీ ప్రచార భారాన్ని కొంత బిహార్‌ ముఖ్యమంత్రి, మహారాష్ట్రలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పంచుకున్నట్టు తెలుస్తోంది.  

రాహుల్‌ ర్యాలీ జోరు...
ఉత్తర ప్రదేశ్‌పై బీజేపీ లాగానే కాంగ్రెస్‌ కూడా కీలకంగా దృష్టి సారించింది. యూపీలో మొత్తం 19 ర్యాలీల్లో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. అందులో ఆరు ర్యాలీలు రాహుల్‌ సొంత నియోజకవర్గమైన అమేథీలోనూ, రెండు రాయబరేలీ, రెండు సుల్తాన్‌పూర్, రెండు బారాబంకీ నియోజకవర్గాల్లోనూ పాల్గొన్నారు. రాహుల్‌ మధ్య ప్రదేశ్‌లో 17 ర్యాలీలూ, రాజస్తాన్‌లో 12 ర్యాలీల్లో మోదీ దీటుగా ప్రచారంలో పాల్గొన్నారు.  
   
ప్రధాని మోదీ రోజుకి 3 నుంచి 4 ర్యాలీలతో ప్రచారాన్ని ప్రారంభించి రెండు సందర్భాల్లో మాత్రం రోజుకి ఐదు ర్యాలీల్లో పాల్గొన్నారు. మోదీ మొత్తం  ప్రచారంలో మధ్య మధ్యలో కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే విరామం తీసుకున్నారు.  నింగీ నేలా మార్గాన మోదీ ఈ ప్రచారంలో మొత్తం 100,500 కిలోమీటర్లను కవర్‌చేశారు. అత్యధికంగా ఏప్రిల్‌ 18న మోదీ 4000 కిలోమీటర్లు సుదీర్ఘంగా ప్రయాణించారు. గుజరాత్‌లోని అమ్రేలీ నుంచి కర్నాటకలోని బాగల్కోట్, చిక్కోడీ, కేరళలోని తిరువనంతపురంలకు మోదీ ఈ ఎన్నికల మొత్తం ప్రచారంలో అత్యధిక కిలోమీటర్లు ప్రయాణించడం విశేషం.

మోదీ సభలన్నింటిలో అత్యధిక మంది జనం హాజరయ్యింది ఏప్రిల్‌ 3న కోల్‌కతాలో జరిగిన సభ. ఈ సభకి 5 లక్షల మంది ప్రజలు హాజరైనట్టు బీజేపీ ప్రకటించుకుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సైతం జనవరి 6 నుంచి మార్చి 8 వరకు దాదాపు 61 సభల్లో ప్రసంగించారు. 43 ఇతర రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రకటన అనంతరం అమిత్‌ షా మొత్తం 161 ర్యాలీల్లోనూ, 18 రోడ్‌షోల్లోనూ పాల్గొన్నారు. రోజుకి సగటున 1,166 కిలోమీటర్ల చొప్పున, మొత్తం 158,000 కిలోమీటర్లు అమిత్‌ షా ప్రయాణించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 129 ర్యాలీలూ, నితిన్‌ గడ్కారీ 56 ర్యాలీలూ, సుష్మాస్వరాజ్‌ 23 ర్యాలీల్లోనూ పాల్గొన్నారు. యోగీ ఆదిత్యనాథ్‌ 135 ర్యాలీల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు