పాతాళంలో దాక్కున్నా వదలం

5 Mar, 2019 02:52 IST|Sakshi
జామ్‌నగర్‌ సభలో ప్రసంగిస్తున్న మోదీ

పొరుగుదేశంలో ఉగ్రమూకల అంతుచూస్తామన్న ప్రధాని

విజ్ఞత ప్రదర్శించాలంటూ ప్రతిపక్షాలకు చురకలు

జామ్‌నగర్‌/అహ్మదాబాద్‌: ‘ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా వదలిపెట్టబోం. వాళ్ల స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి అంతం చేయడమే మన లక్ష్యం. ఒక కార్యక్రమం పూర్తయింది కదా అని ప్రభుత్వం ఆగిపోదు. మరింత కఠిన, తీవ్రమైన మరిన్ని చర్యలకు వెనుకాడబోదు’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్, అహ్మదాబాద్‌లలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్‌ దాడి పైలట్‌ప్రాజెక్టు మాత్రమే.. అసలైన దాడులు ఇకపై మొదలవుతాయని ప్రధాని అన్నారు.

పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని రూపుమాపే దాకా ఇవి కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ‘పొరుగు దేశంలో ఉన్న ఉగ్ర వ్యాధి మూలాలను తొలగించి మనం ఆ వ్యాధిని నయం చేయలేమా? ఉగ్రవాదంతో భారత్‌ను నాశనం చేయాలని చూస్తున్న వారిని వేరే దేశంలో ఉన్నాసరే వదలబోం’ అని అన్నారు. బాలాకోట్‌ ఐఏఎఫ్‌ దాడికి రఫేల్‌ విమానాలను వాడితే ఫలితం వేరేలా ఉండేదన్న తన ప్రకటనపై పెడార్థాలు తీసేముందు విపక్ష నేతలు కాస్త విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు.

‘రఫేల్‌ విమానాలు మనకు సకాలంలో అంది ఉంటే బాలాకోట్‌ దాడి ఫలితం మరోలా ఉండేదని చెప్పా. కానీ, వాళ్లు(ప్రతిపక్షాలు) మన వైమానిక దళాల సామర్థ్యాన్ని నేను అనుమానిస్తున్నానంటూ మాట్లాడుతున్నారు. దయచేసి విజ్ఞతతో మాట్లాడండి. బాలాకోట్‌ దాడిలో రఫేల్‌ను వాడినట్లయితే మనం ఒక్క ఫైటర్‌ జెట్‌ను కూడా కోల్పోయే వాళ్లం కాదు. అలాగే, ప్రత్యర్థుల విమానం ఒక్కటీ మిగిలేది కాదనేది నా ఉద్దేశం. నా మాటలను వాళ్లు అపార్థం చేసుకుంటే నేనేం చేయాలి? వాళ్ల పరిమితులు వాళ్లవి’ అని మోదీ వ్యాఖ్యానించారు.

బాలాకోట్‌ దాడులకు ఆధారాలు బయటపెట్టాలంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న డిమాండ్లపై ప్రధాని స్పందిస్తూ.. ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంతో తాను పనిచేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనను తొలగించేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. నేడు మన ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌ పత్రికల్లో ప్రధాన శీర్షికలతో ప్రచురితమవుతాయంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం కాబట్టే ప్రభుత్వం బాలాకోట్‌ దాడికి పూనుకుందని ప్రతిపక్షాలు భావిస్తే..సర్జికల్‌ స్టైక్స్‌(2016)సమయంలో ఏ ఎన్నికలున్నాయి? అని ఆయన ప్రశ్నించారు.

దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు పేలవమైన స్వల్పకాలిక విధానాలకు బదులు నిర్మాణాత్మక, దీర్ఘకాలిక చర్యలు అవసరమని తెలిపారు. పదేళ్లకోసారి రైతు రుణాలు మాఫీ చేయడం, ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్‌ పని అంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని బాంద్రా–జామ్‌నగర్‌ హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును, అహ్మదాబాద్‌ మెట్రో మొదటి దశ(6.5కిలోమీటర్లు)ను ప్రారంభించి వస్త్రాల్‌– అప్పారెల్‌ పార్కు ఏరియా మార్గంలో కొంతదూరం మెట్రో రైలులో ప్రయాణించారు.

మరిన్ని వార్తలు