మోదీ..ముద్ర!

1 Jun, 2019 03:36 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోదీ

అమిత్‌షాకు హోంశాఖ

రాజ్‌నాథ్‌కు రక్షణ

నిర్మలకు ఆర్థికం

జైశంకర్‌కు విదేశీ వ్యవహారాలు

బాధ్యతలు స్వీకరించిన పలువురు మంత్రులు

శాఖలు కేటాయిస్తూ రాష్ట్రపతిభవన్‌ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కొత్త కేబినెట్‌లో శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. అమిత్‌ షా, రాజ్‌నాథ్, నితిన్‌ గడ్కారీ, నిర్మలా సీతారామన్‌.. తదితర కీలక నేతలకు మోదీ ఏ శాఖలు అప్పగించనున్నారనే దానిపై ఉత్కంఠ వీడింది. తన సన్నిహితులకు, విధేయులకు కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా తనదైన ముద్ర వేశారు. ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన హోం శాఖను ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి దారులు పరిచిన సన్నిహితుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు అప్పగించారు. అదేవిధంగా, సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌కు రక్షణ శాఖను, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, గడ్కారీకి రోడ్డు రవాణా, రహదారుల శాఖతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలను అప్పగించారు.  ఈమేరకు రాష్ట్రపతి భవన్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రధాని మోదీతోపాటు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయెల్, జైశంకర్‌ తదితరులు శుక్రవారమే బాధ్యతలు స్వీకరించారు.    

షా రాకతో..తగ్గనున్న ఎన్‌ఎస్‌ఏ ప్రాధాన్యం
గత ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఎన్‌కే దోవల్‌ క్రియాశీలకంగా వ్యవహరించారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఆయనే తీసుకునేవారు. కానీ, అమిత్‌ షా రాకతో ఈసారి ఆయన ప్రాధాన్యం తగ్గిపోనుంది. ప్రభుత్వంలో నంబర్‌–2గా మారనున్న అమిత్‌ షాయే రక్షణ సంబంధ విషయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. హోం మంత్రిగా అమిత్‌ షా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370, 35 ఏ అంశాలతోపాటు ఉగ్రవాదం, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మావోయిస్టుల ముప్పు, అస్సాం పౌరసత్వ బిల్లు, ట్రిపుల్‌ తలాక్‌ వంటి వాటిపై ప్రముఖంగా దృష్టిసారించాల్సి ఉంది. అదేవిధంగా ప్రధానితోపాటు హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఎంతో కీలకమైన రక్షణ వ్యవహారాల కేబినెట్‌ కమిటీలోకి సుష్మా స్వరాజ్, అరుణ్‌ జైట్లీ స్థానంలో అమిత్‌ షా, జై శంకర్‌ చేరారు.

పలువురికి అదనపు బాధ్యతలు
గత మంత్రి వర్గంలో రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన పీయూష్‌ గోయెల్‌కు ఈసారి వాణిజ్య, పరిశ్రమల శాఖ అదనంగా కేటాయించారు. ఆయనే నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖను మాత్రం కొత్తగా కేబినెట్‌లోకి తీసుకున్న ప్రహ్లాద్‌ జోషికి ఇచ్చారు. జోషికి పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖను కూడా కేటాయించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని ఆ పార్టీకి కంచుకోటగా భావించే అమేథీలో ఓడించిన స్మృతీ ఇరానీకి జౌళి శాఖతోపాటు ఈసారి మహిళా శిశు అభివృద్ధి శాఖలను ఇచ్చారు. గత మంత్రి వర్గంలో మాదిరిగానే ధర్మేంద్ర ప్రధాన్‌ ఈసారి కూడా పెట్రోలియం శాఖ ఇచ్చారు. దీంతోపాటు ఉక్కు మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించారు. రవి శంకర్‌ ప్రసాద్‌కు ఈసారి కూడా న్యాయ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బాధ్యతలు ఇచ్చారు. దీంతోపాటు టెలికం శాఖను ఇచ్చారు. ప్రకాశ్‌ జవడేకర్‌కు ఈసారి పర్యావరణ శాఖతోపాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల బాధ్యతలను, నరేంద్ర సింగ్‌ తోమర్‌కు వ్యవసాయ శాఖతోపాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ బాధ్యతలు ఇచ్చారు.  

జైట్లీ బాధ్యతలు నిర్మలకు..
నిర్మలా సీతారామన్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అనారోగ్య కారణాలతో కేబినెట్‌కు దూరంగా ఉన్న సీనియర్‌ నేత, గత కేబినెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బాధ్యతలను ఈసారి నిర్మలకు కేటాయించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టనున్న రెండో మహిళా మంత్రిగా> ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో ఇందిరాగాంధీ కొంతకాలం పాటు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. గత కేబినెట్‌లో ఆమెను రక్షణ మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా అనురాగ్‌ ఠాకూర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

దౌత్యాధికారులకు అందలం
ఊహించని విధంగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జై శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖ బాధ్యతలను అప్పగించారు. విదేశాంగ శాఖ బాధ్యతలను చేపట్టిన మొదటి దౌత్యాధికారి ఈయనే. ఏ సభలోనూ ఆయన సభ్యుడు కాదు. దీంతో నిబంధన ప్రకారం ఆరు నెలల్లోగా ప్రభుత్వం ఆయనకు సభ్యత్వం కల్పించే అవకాశం ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ చేసిన జై శంకర్‌..దౌత్యాధికారిగా విశేష అనుభవం గడించారు. రష్యా, చైనా, అమెరికాల్లో భారత్‌ తరపున వివిధ హోదాల్లో దౌత్యాధికారిగా సేవలందించారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కేబినెట్‌లో చోటు దక్కిన మాజీ దౌత్యాధికారి హర్దీప్‌ పూరికి పౌర విమానయాన, పట్టణాభివృద్ధి శాఖ(స్వతంత్ర హోదా)తోపాటు, వాణిజ్య పరిశ్రమల శాఖ బాధ్యతలు ఇచ్చారు. మాజీ ఐఏఎస్‌ అధికారి ఆర్‌కే సింగ్‌కు విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ అప్పగించారు.  

టార్గెట్‌ 35ఏ కశ్మీర్‌పై అమిత్‌ షా గురి
బీజేపీలో నంబర్‌ టూ స్థానంలో ఉన్న అమిత్‌ షా దేశానికి కొత్త హోం మంత్రి అయ్యారు.  ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, అక్రమ వలసలను అరికట్టడం నూతన హోం మంత్రి ప్రా«థమ్యాలు.అలాగే, ఎన్‌ఆర్‌సీ(జాతీయ పౌరసత్వ బిల్లు)ని దేశ మంతా అమలు పరచడం, జమ్ము,కశ్మీర్‌లో 35ఏ అధికరణను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా అమిత్‌ షా తీసుకునే అవకాశం ఉంది. 35ఎ అధికరణం కశ్మీరీలకు(స్థానికులు) ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పిస్తోంది.

కశ్మీర్‌లో మహిళలు, శాశ్వత నివాసులు కానివారి పట్ల వివక్ష చూపుతున్న రాజ్యాంగంలోని 35ఎ అధికరణను రద్దు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది. 35 ఎ అధికరణ రాష్ట్రాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉందని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్‌లో ప్రజలందరి సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది.  కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలిచ్చే 370వ అధికరణను జనసంఘ్‌లో ఉన్నప్పటి నుంచీ అమిత్‌ షా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అక్రమ వలసలను అరికట్టడం కోసం ఎన్‌ఆర్‌సిని దేశమంతా అమలు చేస్తామని కూడా షా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హోం మంత్రిగా అమిత్‌ షా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అపర చాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా మోదీకి అత్యంత విశ్వాస పాత్రుల్లో ఒకరు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్‌ షా ఆ రాష్ట్ర హోం మంత్రిగా పని చేశారు. దేశంలో మావోయిస్టు హింస పెరుగుతుండటం, కశ్మీర్‌లో తీవ్రవాదం పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో  ఆ సమస్యలను పరిష్కరించడం షా ముందున్న ప్రధాన సవాళ్లని పరిశీలకులు అంటున్నారు. కశ్మీర్‌లో తీవ్రవాదాన్ని బలప్రయోగంతో అణచివేయాలా లేక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలా అన్నది నిర్ణయించడం ఆయన ఎదుర్కొనే మరో కీలకాంశం. సుప్రీం కోర్టు విధించిన గడువు జూలై 31  ఎన్‌ఆర్‌సి ప్రక్రియను పూర్తి చేయం, ఆంతరంగిక భద్రత పరిరక్షణ షా ముందున్న మరికొన్ని సవాళ్లు.
 

>
మరిన్ని వార్తలు