‘పాక్‌ ఇప్పటికీ శవాలు లెక్కపెట్టుకుంటోంది’

29 Mar, 2019 15:00 IST|Sakshi

ఒడిశా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ

భువనేశ్వర్‌: బాలాకోట్‌ మెరుపు దాడులు జరిపి నెల రోజులు గడుస్తున్నప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాదుల శవాలను లెక్కబెట్టుకుంటోందని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు మాత్రం ఆధారాలు అడుగుతున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శత్రువు ఇంటికెళ్లి అక్కడి ఉగ్రవాదులను ఏరేస్తే వీళ్లు ఆధారాలు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ శక్తి ప్రకటనను తప్పుబట్టడంపై కూడా మోదీ మండిపడ్డారు. ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవల ఉపగ్రహ విధ్వంసక క్షిపణిని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపిన విషయం తెలిసిందే. దీని గురించి మోదీ  ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శుక్రవారం ఒడిశాలో పర్యటించారు.

ఇక్కడి కోరాపూట్‌ జిల్లాలోని జేపోర్‌లో బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ప్రజల మద్దతులోనే ఐదేళ్లకాలంలో తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం అంతరిక్షంలోనూ ఓ కాపాలాదారును పెట్టిందని అన్నారు. కేవలం నినాదాలకే పరిమితయ్యే వారికి ఓటు వెయ్యవద్దని.. దృఢమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వానికి మాత్రమే ఓటు వేయాలని ఓటర్లను కోరారు. భారత అంతరిక్ష ఘనతను తక్కువ చేసి మాట్లాడిన ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. మన సైనికులు, సైంటిస్టులను అవమానిస్తున్న ఇలాంటి వాళ్లు మనకు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. యాంటీ శాటిలైట్ టెక్నాలజీని విమర్శిస్తున్న వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని మోదీ అన్నారు.

>
మరిన్ని వార్తలు