హుజుర్‌నగర్‌లో త్రిముఖ పోరు

24 Sep, 2019 18:18 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు కనపడుతోంది. ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. అంగబలం, ధనబలం ఉన్న అభ్యర్థులకే టికెట్‌లు కేటాయించాయి. కాగా అధికార పార్టీ నుంచి సైదిరెడ్డిని ఇప్పటికే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించగా, కాంగ్రెస్ నుంచి అందరూ అనుకున్నట్టుగానే పీసీసీ చీఫ్ ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పేరును సోనియాగాంధీ ఖరారు చేశారు. ఇక ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార హోరు ప్రారంభించారు. ఉప ఎన్నిక విజయం ఇప్పుడు మూడు పార్టీలకు సవాల్‌గా మారింది. సాధారణ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్లే స్వల్ప తేడాతో ఓడానని ఈ సారి ఖచ్చితంగా విజయం తనదేనని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి చెబుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 35వేల మంది ఓటర్లు ఉన్నారు.

సోమవారం రోజున నల్గొండ జిల్లాకు వచ్చిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పల్లారాజేశ్వర్ రెడ్డికి హుజుర్‌నగర్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతలు అప్పగించారు. మరికొంత మంది మంత్రులను కూడా నియోజకవర్గానికి బాధ్యులుగా నియమించనున్నారు. ఇక సిట్టింగ్‌ స్థానంలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉ‍న్న కాంగ్రెస్‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఊహించినట్టుగానే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సతీమణి పద్మావతికి టికెట్ డక్కడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు గెలిచిన ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విజయంతో రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామేనని ఇక్కడి నుంచే సంకేతాలు ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నియోజకవర్గంలో ఉప్పు నిప్పులా ఉండే ఉత్తమ్- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు కలిసి పోవడం, పద్మావతిని గెలిపించుకుంటాం అని కోమటిరెడ్డి ప్రకటన చేయడంతో ఇక్కడ గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టినట్టయింది. ఇక ఎప్పుడు తమకు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్న బీజేపీ ఈ ఉపఎన్నికలో విజయం ద్వారా పట్టుసాధించాలని చూస్తుంది. బలమైన అభ్యర్థిత్వం కోసం అందరితో సంప్రదింపులు జరుపుతోంది. మాజీ ఎమ్మెల్యే కుమార్తె, కోదాడ వాసి శ్రీకళారెడ్డి, తోట రామారావు పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీకళారెడ్డి గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కోదాడ ఇన్‌చార్జిగా పనిచేశారు. కేంద్ర మంత్రులు ఇక్కడ పాగా వేసి బీజేపీ విజయం కోసం గట్టిప్రయత్నాలే చేస్తున్నారు.

సీఎం కేసీఆర్, రాహుల్ గాంధీ, అమిత్ షా లాంటి హేమాహేమీలంతా హుజుర్‌నగర్ ప్రచారంలో పాల్గొనే అవకాశం కనబడుతోంది. కాగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వబోమని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామని సీపీఎం, సీపీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ అక్టోబర్‌ 21న జరగనుంది. 24వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ చేపడతారు. సెప్టెంబర్‌ 23 నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 3 వరకు ఉపసంహరణ జరగనుంది.

మరిన్ని వార్తలు