టికెట్ల వేట.. ఉత్కంఠ!

11 Mar, 2019 06:29 IST|Sakshi
అసదుద్దీన్‌ ఒవైసీ అజారుద్దీన్‌ రాజాసింగ్‌

షార్ట్‌ లిస్ట్‌లు రెడీ చేసిన ప్రధాన పార్టీలు

ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటనలు

మూడు ప్రధాన పార్టీల్లో తప్పని పోటాపోటీ

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల   

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. టికెట్ల వేటలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేటర్‌ పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ఆయా పార్టీల అధిష్టానాలు సైతం ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ మళ్లీ బరిలోకి దిగుతుండగా, బీజేపీ నుంచి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా, కాంగ్రెస్‌ నుంచి క్రికెటర్‌ అజారుద్దీన్, పల్లె లక్ష్మణరావు గౌడ్‌లలో ఒకరు పోటీకి దిగనున్నారు.

మల్కాజిగిరిలో..నువ్వా.. నేనా
మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. కూకట్‌పల్లికి చెందిన నవీన్‌రావుతో పాటు మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, బండి రమేష్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో నవీన్‌రావు, రాజశేఖర్‌రెడ్డిలలో ఒకరికి టికెట్‌ లభించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవీన్‌రావు మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌లో పనిచేస్తూ కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాజశేఖర్‌రెడ్డికి మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లో బలమైన అనుచర వర్గం ఉంది. ఇక కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, ఆకుల రాజేందర్, బీజేపీ నుంచి మురళీధర్‌రావు, రాంచందర్‌రావుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

చేవెళ్లలో.. మొదలైన వేడి
చేవెళ్ల లోక్‌సభ పరిధిలో షెడ్యూల్‌ విడుదల కంటే ముందుగానే రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ తరపున సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ ఖరారైంది. దీంతో ఆయన నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి పారిశ్రామికవేత్త గడ్డం రంజిత్‌రెడ్డి పేరు సైతం అధికారికంగా ప్రకటించటమే తరువాయి. సౌమ్యుడన్న పేరున్న రంజిత్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ శ్రేణులతో విస్తృతమైన సంబంధాలున్నాయి. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి రంజిత్‌రెడ్డి క్లాస్‌మేట్‌ కావటం విశేషం. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర నాయకుడు బి.జనార్దన్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. జనార్దన్‌రెడ్డి కూడా ఇప్పటికే విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.

సికింద్రాబాద్‌లో.. పోటాపోటీ
సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ పోటీ చేసేందుకు సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించిన దత్తాత్రేయ ఈసారి కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ఆయనను వయోభారం కారణంగా పక్కకు పెడితే ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఖరారు కాగా, టీఆర్‌ఎస్‌ నుంచి సాయికిరణ్‌ యాదవ్,బండి రమేష్‌లలో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు