ఇంటర్వ్యూ రచన

21 Mar, 2019 09:38 IST|Sakshi

ఎన్నికల సిత్రం

‘‘నమస్కారం సార్‌.. పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీతగారి ఇల్లు ఇదేనా?’’
‘‘ఎవరయ్యా నువ్వు? పిల్లకాకిలా ఉన్నావ్‌. పితృకాకిలా మా ఇంటికే వచ్చి ‘కావ్‌’ మంటున్నావ్‌?’’
‘‘అంటే.. పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మీరేనా సార్‌?!’’
‘‘ఆంధ్రాకి వచ్చావ్‌. విజయవాడ వచ్చావ్‌. మా ఇంటికి వచ్చావ్‌. నన్నే ‘మీ ఇల్లు ఇదేనా? అని అడుగుతున్నావ్‌! నువ్వెవరు, ఎందుకొచ్చావ్, ఎక్కడి నుంచి వచ్చావ్‌?’’

‘‘జర్నలిస్టుని సార్‌. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను’’
‘‘ముందు ఆ లాగూ పైకి లాక్కో. జారిపోతోంది. నువ్వు జర్నలిస్టు ఏంటి, నన్ను ఇంటర్వ్యూ చెయ్యడం ఏంటి? పిల్లబిత్తిరిలా ఉన్నావ్‌! నా వయసెంతో తెలుసా? దగ్గరదగ్గర నైన్‌టీ. నిన్ను చూస్తే నైంటీ నైన్‌లో పుట్టినట్టున్నావ్‌. జర్నలిజం ఎప్పుడు చేశావ్,  జర్నలిస్టుగా ఎక్కడ చేస్తున్నావ్‌?’’
‘‘మీరు ఏమీ అనుకోకపోతే ముందు నా లాగూ సంగతి చెప్తా సార్‌. అది లాగూ కాదు. షార్ట్‌. అది జారిపోవడం లేదు. లో వెయిస్ట్‌. మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యడానికి కంఫర్ట్‌గా ఉంటుందని వేసుకొచ్చా’’

‘‘సర్లే, ఏ పేపర్‌లో చేస్తున్నావ్‌?’’
‘‘ఎక్కడా చెయ్యట్లేదు. పౌర పాత్రికేయుడిని. సిటిజన్‌ రిపోర్టర్‌ సార్‌ నేను. ప్రజల్లోకి వెళ్తాను. ప్రజల్లోకి వెళ్లేవాళ్లతో వెళ్తాను. ప్రజా సమస్యల గురించి రాస్తాను’’
‘‘మరి నా దగ్గరికి ఎందుకొచ్చావ్‌? నేనూ ఒక ప్రజా సమస్యనేనని చెప్పారా నీ ప్రజలెవరైనా?’’
‘‘కోప్పడకండి సార్‌. మీ రచనలంటే నాకు ఇష్టం. ఈమధ్య ‘ఆ’ పేపర్‌లో మీ రచనలు రెండు చదివాను. నిన్న వచ్చిన పెద్ద రచన ఒకటి, ఎలక్షన్‌ షెడ్యూల్‌ వచ్చిన వెంటనే మీరు చేసిన రచనొకటి. చాలా రోజుల తర్వాత రచించినట్లున్నారు’’

‘‘నీ బొంద. అవి రచనలు కాదు. ఇంటర్వ్యూలు. నేను సీనియర్‌ జర్నలిస్టుని. సీనియర్‌ జర్నలిస్టు ఇంటర్వ్యూలు ఇస్తాడు. రచనలు చెయ్యడు.’’
‘‘కానీ ఇంటర్వ్యూలనే మీరు భలే రచించారు సార్‌.’’
భీష్మ పాత్రికేయుడికి ఆ పౌర పాత్రికేయుడి మీద డౌట్‌ కొట్టింది. 

‘‘భలే రచించానా? అందులో నీకేం భలేగా అనిపించిందో చెప్పు’’ అన్నాడు.  
‘‘ఇప్పటివరకు 18 మంది సీఎంలతో సన్నిహితంగా మెలిగారు సార్‌ మీరు. అది నచ్చింది. సన్నిహితంగా మెలిగారూ అంటే.. ఆంధ్రరాష్ట్ర తొలి సీఎం నుంచి నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు వరకు.. మీరు వాళ్లందరితో కలిసి డిన్నర్‌ కూడా చేసి ఉంటారు. అది నచ్చింది. ఈ తొంభై ఏళ్ల వయసులో నాకు ఆశలేమీ లేవు అన్నారు. అది నచ్చింది’’ ‘‘ఇంకా..’’
‘‘ఆ.. ఇంకా ఏంటంటే.. కారు నడపడంలో అనుభవం లేనివాడిని తీసుకొచ్చి డ్రైవింగ్‌ సీట్లో కూర్చోబెడితే ఏం జరుగుతుందో.. పాలనలో కూడా అదే జరుగుతుంది అన్నారు. అది కూడా నచ్చినట్లే ఉంది.’’
‘‘నచ్చినట్లే ఏంటి.. నచ్చలేదా?’’ ‘‘అంటే నచ్చలేదనే చెప్పాలి సార్‌’’  
పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భ్రుకుటి ముడివేశాడు. 

‘‘సీఎం కావాలంటే సీఎం అయి ఉండాలి అన్నట్లుంది సార్‌ మీ రచన. ప్రకాశం పంతులు, చంద్రబాబు, మధ్యలో పదహారు సీఎంలు.. వీళ్లంతా సీఎం అయ్యాకే సీఎం అయ్యారా సార్‌! 18 మంది సీఎంలతో క్లోజ్‌గా తిరిగిన మీకు ఇంత చిన్న విషయం తెలీ లేదా సార్‌. ఎమ్మెల్యే అవాలంటే ఎమ్మెల్యే అయి ఉండాలని, ఎంపీ అవ్వాలంటే ఎంపీ అయి ఉండాలని, మంత్రి అవ్వాలంటే మంత్రి అయి ఉండాలి అన్నట్లే ఉంది సార్‌ మీ రచనంతా. డ్రైవింగ్‌ రాకుండానే లోకేశ్‌బాబు ఎమ్మెల్సీ అవలేదా! డ్రైవింగ్‌ రాకుండానే లోకేశ్‌బాబు మంత్రి అవలేదా! డ్రైవింగ్‌ రాకుండానే ఇప్పుడు లోకేశ్‌బాబు ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా? డ్రైవింగే రాని లోకేశ్‌బాబు ఇన్ని చేస్తున్నప్పుడు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గాల ప్రజల్ని డ్రైవ్‌ చేసిన యువకుడు, ప్రతిపక్ష నేతగా రాష్ట్రాన్ని డ్రైవ్‌ చేసిన నాయకుడు సీఎం కాకూడదని మీరెందుకు సార్‌ రచనలు చేస్తున్నారు!!’’ అన్నాడు పౌరపాత్రికేయుడు. 

పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బిత్తరపోయాడు.  
‘‘వాళ్లందరూ కాదు సారు. మీరు చెప్పండి. జర్నలిస్టు అయి ఉండబట్టే మీరు జర్నలిస్టు అయ్యారా’’.. అడిగాడు పౌరపాత్రికేయుడు.  పాత్రికేయ భీష్ముడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత తత్తరపడ్డాడు. – మాధవ్‌

మరిన్ని వార్తలు