కేసీఆర్‌ను నిలదీయండి: పొన్నం

26 Apr, 2018 14:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్లీనరీ నిర్వహించాలని చూస్తోన్న టీఆర్‌ఎస్‌ పార్టీ హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఎంతవరకు అమలుయ్యయో ఆ వివరాలను ప్రజలకు అందజేయలన్నారు. కాంగ్రెస్‌ నిర్మించిన ప్రాజెక్టులకు హెడ్‌ రెగ్యులేటరీలు కట్టి మొత్తం టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ నీరో చక్రవర్తిలా ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ అంటూ బెంగాల్‌, బెంగళూరులకు తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత రుణభారం ప్రజలపై మోపడం వాస్తవం కాదా అని పొన్నం ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం సాధించిందో ప్రశ్నించండి అంటూ ప్లీనరీకి హాజరయ్యే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్న కేసీఆర్‌ పొగటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్‌ తన పేరును కల్వకుంట్ల నరసింహన్‌గా మార్చుకోవాలని పొన్నం ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు