పవన్‌ కళ్యాణ్‌ మాటలు ప్రమాదకరం

23 Mar, 2019 17:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చిచ్చు పెడుతున్నారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి విమర్శించారు. ఆంధ్రా వాళ్లను తెలంగాణలో కొడుతున్నారని పవన్‌ చేసిన వ్యాఖ్యలపై పోసాని ఘాటుగా స్పందించారు. పవన్‌ మాటల వల్ల వైషమ్యాలు పెరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌ను పొడిగింది ఎవరు? తెలంగాణ ప్రజలను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పింది ఎవరు? అంటూ పవన్‌కు చురక అంటించారు.

ఓట్ల కోసమే ప్రజలను రెచ్చగొడతావా అంటూ నిలదీశారు. ఆంధ్రావాళ్లను కేసీఆర్‌ బెదిరించి ఒక్క ఎకరం భూమి లాక్కున్నారని నిరూపిస్తే పవన్‌కు పాదాభివందనం చేస్తానని ప్రకటించారు. ఆంధ్రావాళ్లను తెలంగాణ వాళ్లు కొట్టిన ఘటన ఒక్కటైనా చూపిస్తే పవన్‌కు దండం పెడతానని చెప్పారు. హైదరాబాద్‌ వస్తే కేసీఆర్‌ను వాటేసుకుని, ఆంధ్రకు వెళితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం న్యాయం కాదన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్ర, తెలంగాణ వాళ్లు బ్రహ్మాండంగా కలిసివున్నారని తెలిపారు. ఎందుకు విద్వేషాలు రెచ్చగొడతావని ప్రశ్నించారు.

‘సినిమా వాడిగా పవన్‌ కళ్యాణ్‌ నువ్వంటే చాలా నాకు ఇష్టం. నీ నుంచి ఈ మాటలు వచ్చాయంటే నా గుండె పగిలిపోయింది. నీ నోట్లో నుంచి ఇలాంటి మాటలు రావచ్చా? ఆంధ్రజ్యోతి రాసింది, నువ్వు పలికావ్‌. నువ్వు చూడాలిగా పవన్‌ కళ్యాణ్‌. ఒక స్థలం కోసం ఎమ్మెల్యేలను బెదిరిస్తే ఎమ్మెల్యేలు బెదిరిపోయి పార్టీ మారి వైఎస్సార్‌సీపీలో చేరతారా? ఇదే నిజమనుకుంటే చంద్రబాబు 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను బెదిరించి తీసుకెళ్లాడా? అంటే ఆ 23 మంది ఎమ్మెల్యేలు అమాయకులా? చంద్రబాబును చూసి భయపడిపోయి టీడీపీలో చేరిపోయారని చెప్పదల్చుకున్నావా? ఇది తప్పు పవన్‌ కళ్యాణ్‌. ఇలాంటి ఆవేశం రెండు రాష్ట్రాలకు ప్రమాదం. నీ మాటలు జనం నమ్మితే విద్వేషాలు చెలరేగుతున్నాయి. ​కేసీఆర్‌ విషయంలో చంద్రబాబు, పవన్‌ మాటలు నమ్మొదని నేను ప్రజలకు చెబుతున్నా. తెలంగాణలో ఆంధ్రావాళ్లను ఎప్పుడూ బెదిరించలేదు, కొట్టలేద’ని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు