వామపక్ష ఉద్యమ ప్రకాశం

14 Mar, 2019 15:36 IST|Sakshi

వెబ్ ప్రత్యేకం : కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ మార్క్సిస్ట్ (సీపీఎం) ఉద్యమ నిర్మాణంలో ప్రకాశ్‌ కారత్‌ది కీలక పాత్ర. విద్యావంతుడిగా పేరొందిన కారత్‌.. కరడుగట్టిన మార్క్సిస్ట్‌ వాదిగా, విమర్శకుడిగా గుర్తింపుపొందారు. డెభై ఏళ్ల వయసులో కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ మార్క్సిస్ట్‌ సిద్ధాంతానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బూర్జువా, ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికరంగాన్ని ఏకం చేయడం కోసం ఎర్రజెండా పట్టి వామపక్ష ఉద్యమానికి ప్రకాశ్‌ కారత్‌ ఊపిరిలూదారు. విద్యార్థి నాయకుడిగా మార్క్సిజంలోకి అడుగుపెట్టిన కరత్‌‌.. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టి పార్టీలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో అసువులుబాసిన ఎందరో అమరవీరులు చూపిన బాటను అనుసరిస్తూ.. ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తూ పోరాడేతత్వం కారత్‌ది.

ప్రముఖ మార్క్సిస్ట్‌ మహిళా నేత బృందా కారత్‌ను (1975)ను వివాహం చేసుకుని దంపతులిద్దరూ ప్రజాసమస్యలకై పోరాడుతున్నారు. కేవలం ప్రజా ఉద్యమాలతోనే కాక .. పదునైన రచనలతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని చరిత్రలోకి ఎక్కించారు కారత్‌. తానే స్వయంగా రచయితగా అవతారమెత్తి ఎన్నో పుస్తకాలను రచించి కమ్యూనిస్ట్‌ల ఔనత్యాన్ని ప్రపంచాన్నికి పరిచయం చేశారు. దేశంలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఉచ్చస్థితిలో ఉన్నప్పటి నుంచి పార్లమెంట్‌లో కమ్యూనిస్ట్‌ల ప్రాతినిథ్యం కోల్పోయే రెండు రకాల విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కరత్‌కుంది. బూర్జువా పార్టీల ఆధిపత్యం ఓవైపు, దశాబ్దాల చరిత్రగల కమ్యూనిస్ట్‌ కంచుకోటలు బీటలు బారుతూ.. ఎర్రజెండా ఉద్యమాలు బలహీనపడుతున్న పరిస్థితి మరోవైపు. ఈ  నేపథ్యంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రజెండాను ఎగరేసేందుకు సీనియర్‌ నేతగా ప్రకాశ్‌ ఏవిధంగా వ్యూహాలు రచిస్తారో వేచిచూడాలి. 

రాజకీయ నేపథ్యం
ఐదు దశాబ్దాల ప్రజాజీవితంలో కమ్యూనిస్ట్‌గా అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మార్స్‌ సిద్ధాంతానికే కట్టుబడి నిలిచారు. దేశంలో పేరొందిన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడిగా 1971లో మార్క్సిజంలోకి అడుగుపెట్టిన ప్రకాష్‌ కారత్‌.. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి వరకు ఎదిగారు. సీపీఎంకు చెందిన విద్యార్థి సంఘం సంస్థ ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా) వ్యవస్థాపకుల్లో ఇతను కూడా ఒక్కరు. మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ విధించిన ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాడి.. ఏడాది పాటు అజ్ఞాతంలో గడిపాడు. జేఎన్‌యూలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు సీపీఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి, కమ్యూనిస్ట్‌ అగ్రనేత ఏకే గోపాలన్‌ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి ఆడుగుపెట్టారు. 1974-79 మధ్య విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అ తరువాత కమ్యూనిస్ట్‌ ఉద్యమంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన కారత్‌ 1985లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైన్నారు. 1992లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా  పార్టీలో అనేక సంస్కరణలను అమలుచేసిన ప్రకాష్‌.. 2005లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2015 వరకు ఆ పదవిలో కొనసాగారు.

ప్రధాన కార్యదర్శిగా పదవీ  బాధ్యతలు స్వీకరించిన సమయంలో బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో మార్స్సిస్ట్‌ పార్టీ అధికారంలో ఉండి.. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బలంగా ఉంది. యూపీఏ-1 ప్రభుత్వంలో సీపీఎం  ప్రధానమైన భాగస్వామి కావడంలో కేంద్ర ప్రభుత్వంలోను ఆయన చక్రం తిప్పారు. ఆయన  విజ్ఞప్తి మేరకు సోమనాథ్‌ చటర్జీని లోక్‌సభ స్పీకర్‌గా సోనియా గాంధీ నియమించారు. అమెరికాతో న్యూక్లీయర్‌ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చి సంచలనం సృష్టించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 9 తొమ్మిది స్థానాల్లోనే విజయం సాధించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు సీపీఎంకు కంచుకోటాలా ఉన్న బెంగాల్‌లో ఈ నాయకత్వంలోనే దారుణ ఓటమి చవిచూసి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆయన స్థానంలో సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత వారిద్దరి మధ్య విభేదాలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి.  ఏచూరి, కరత్‌ మధ్య విభేదాలు పార్టీని రెండు వర్గాలుగా చీల్చే పరిస్థితి వరకు వెళ్లింది. 

కుటుంబ నేపథ్యం
ప్రకాశ్‌ కరత్‌ 1948  ఫిబ్రవరి 8న బర్మాలో  జన్మించారు. అనంతరం కేరళలో స్థిరపడ్డారు. తండ్రి బర్మా రైల్వేస్‌లో ఉద్యోగి. తన పాఠశాల విద్య అంతా మద్రాస్‌లో కొనసాగించారు. ఉన్నత విద్యవంతుడైన ప్రకాశ్‌ తనకు కాబోయే సహచరి కూడా తన ఆలోచనలకు దగ్గరగా ఉండాలని మొదటి నుంచి అనుకునే వారు. ఆ నేపథ్యంలో లండన్‌లో విద్యనభ్యసించిన సామాజిక కార్యకర్త బృందా కరత్‌ను 1975లో వివాహం చేసుకున్నారు.  భర్త అడుగుజాడల్లోనే నేను కూడా అంటూ మార్స్సిస్ట్‌ ఉద్యమంలోకి ప్రవేశించారు బృందా. 2005లో బెంగాల్‌ నుంచి ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సీపీఎం పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
- సురేష్‌ అల్లిక

మరిన్ని వార్తలు