ఎమ్యెల్యే బాబూమోహన్‌కు నిరసన సెగ

14 May, 2018 10:08 IST|Sakshi
చెక్కుల పంపిణీ కేంద్రం వద్ద కారులోనే ఉండిపోయిన బాబూమోహన్‌

కారును అడ్డుకున్న గ్రామస్తులు, యువకులు

డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు

గ్రామానికి రోడ్డేయాలని డిమాండ్‌  

రేగోడ్‌(మెదక్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు కార్యక్రమంలో అందోల్‌ ఎమ్యెల్యే పి.బాబూమోహన్‌కు నిరసన సెగ తగిలింది. కారును అడ్డుకుని బాబూమోహన్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సుమారు అరగంట పాటు ఎమ్యెల్యే తన కారులోనే ఉండిపోయారు.  ఈ సంఘటన మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలంలోని సిందోల్‌ గ్రామంలో ఆదివారం జరిగింది.

వివరాల్లోకి వెళితే..  రైతుబంధు కార్యక్రమంలో భాగంగా సిందోల్‌ గ్రామంలో ఆదివారం రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందోల్‌ ఎమ్యెల్యే పి.బాబూమోహన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకోగానే గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు ఎమ్యెల్యే కారును అడ్డుకున్నారు.

కారుముందు ఉండి బాబూమోహన్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఐదేళ్లుగా రోడ్డును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నిరసన కారుల తోపులాటలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యంతో ఎమ్యెల్యే కారు చెక్కుల పంపిణీ కార్యక్రమం వద్దకు కదిలింది.

ఎవడ్రా ఫొటోలు తీసేది..

నిరసన కారులు పక్కకు వెళ్లిన అనంతరం కారులో నుంచి కిందకి దిగుతున్న తనను విలేఖరులు ఫొటోలు తీస్తుండటాన్ని గమనించిన బాబూమోహన్‌కు ఎవడ్రా ఫొటోలు తీసేదంటూ విలేఖరులపై ఆగ్రహంతో ఊగిపోయారు. మేము విలేఖరులం.. మీ వార్తలు కవర్‌ చేయడానికే వచ్చాం. మాకు స్వేచ్ఛ ఉంది.. వద్దంటే వెళ్లిపోతామంటూ బాబూమోహన్‌తో విలేఖరులు తెలిపారు.   
 

మరిన్ని వార్తలు