ఆధ్యాత్మిక పరిమళం..పుట్టపర్తి

23 Mar, 2019 08:34 IST|Sakshi

  పునర్విభజనతో నియోజకవర్గానికి రూపం 

  2009 నుంచి ఉనికిలోకి.. 

 ఇప్పటి వరకూ రెండుసార్లు ఎన్నికలు  

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం.. చిత్రావతి నది ప్రవహించే పుణ్యభూమి.. చదువుల తల్లి(డీమ్డ్‌ యూనియవర్సిటీ)కి నెలవు. అద్భుత దృశ్యాల(నక్షత్రశాల)కు కొలువు.అతి పెద్దచెరువు(బుక్కపట్నం) ఉన్న ప్రాంతం... లక్షలాది మందికి ప్రాణం పోస్తున్న వైద్యాలయం (సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి) కలిగి ఉన్న దివ్యభూమి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న నియోజకవర్గం. ప్రశాంతతకు మారుపేరుగా.. మంచితనానికి నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. భగవాన్‌ సత్యసాయి బోధనలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. 

మొత్తం ఓటర్లు  1,90,930 
పురుషులు 95,877
మహిళలు  95,046

బుక్కపట్నం: పుట్టపర్తి నియోజకవర్గం 2009లో ఏర్పడింది. 2004కు ముందు పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల మండలాలతో పాటు చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాలు, ముదిగుబ్బ మండలం మంగళమడక, గరుగుతండా కొంత భాగం, ధర్మవరం మండలం నేలకోట, ఏలుకుంట్ల, బుడ్డారెడ్డిపల్లి గోరంట్ల నియోజకవర్గంలో ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువులు మండలాలు కలిపి పుట్టపర్తి నియోజకవర్గంగా ఏర్పడ్డాయి. 

1983లో టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983, 1985, 1995, 1999 మినహా ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. 1978లో మాత్రం పాముదుర్తి రవీంద్రారెడ్డి తన వదిన కాంగ్రెస్‌ అభ్యర్థి, మంత్రి అయిన పద్మాభాస్కర్‌రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన 1978, 1989, 2004లో మూడుసార్లు గెలుపొందగా 1983, 1985లో టీడీపీ నుంచి డాక్టర్‌ కేశన్న విజయం సాధించారు.

1995, 1999లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గెలిచారు. ఇక 2004లో నిమ్మల కిష్టప్పపై కాంగ్రెస్‌ అభ్యర్థి పాముదుర్తి రవీంద్రారెడ్డి కేవలం 184 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె రఘునాథరెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కడపల మోహన్‌రెడ్డిపై 1058  ఓట్ల స్వల్ప మెజారిటీతో పల్లె గట్టెక్కారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొత్తకోట సోమశేఖర్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి గెలుపొందారు.  

ప్రధాన సమస్యలు 
మారాల రిజర్వాయర్‌ ఉన్నా పిల్లకాలువలు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు 18 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా ఉంది. కృష్ణా జలాలు కళ్ల ముందే పారుతున్నా చెరువులు నింపకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికితోడు సాగునీరు లేక వేలాది ఎకరాలు బీడుగా మారాయి. అమడగూరు మండలంలో సైన్స్‌ సిటీ భూములు దాదాపు 10 వేల ఎకరాలు వృథాగా ఉన్నాయి. పరిశ్రమలు లేకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులు పొట్టకూటి కోసం కర్ణాటక, చైన్నై లాంటి ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. పుట్టపర్తి విమానాశ్రయ విస్తరణ ఆచరణకు నోచుకోవడం లేదు. పుట్టపర్తిని జిల్లాగా చేయాలన్న ఇక్కడి ప్రజలు ఆశలు నెరవేరడం లేదు. 

గోరంట్లలో పాముదుర్తి వంశీయులదే హవా
గోరంట్ల నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరుగగా ఇక్కడ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులు 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిశారు. గోరంట్ల నియోజకవర్గంలో బుక్కపట్నం మండలం పాముదుర్తి వంశీయులదే హవా సాగింది. పాముదుర్తి పెద్ద బయపరెడ్డి హిందూపురం పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించగా ఆయన సోదరుడు పాముదుర్తి రవీంద్రారెడ్డి 1978, 89, 2004లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో ఈయన తిరులేని నేతగా ఉన్నారు. బుక్కపట్నం మండలంలో నేటికీ అనేక గ్రామాలలో రవీంద్రారెడ్డి కుటుంబీకుల ప్రభావం ఉంది. 

రెండ్లు సారి గెలిచినా ‘పల్లె’ చేసింది శూన్యం 
పల్లె రఘునాథరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని నియోజకవర్గ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికల బరిలో నిలవడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పుట్టపర్తిలో విమానాల విడిభాగాల పరిశ్రమ ఏర్పాటు, సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు, కృష్ణా జలాలతో నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపుతామన్న హామీలు ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. ఇక ఒకటి, రెండు చెరువులను అరకొరగా నింపినా ఒక ఎకరా కూడా సాగులోకి తేలేకపోయారు.

దీంతో ఎమ్మెల్యేపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుక్కపట్నం చెరువు ముంపు భూముల రైతులకు ఒక్క పైసా పరిహారం ఇప్పించలేకపోయారు. సుమారు రూ.30 కోట్ల మేర నిధులు మాంజూరైనా పనులు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారని, దీంతో ఆ నిధులు వెనక్కు వెళ్లి పోయాయని అసమ్మతి నేత,  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పీసీ గంగన్న బహిరంగంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉండగా పల్లె సొంత పార్టీ నుంచే సవాళ్లను ఎదుర్కొంటున్నారు.  ఇప్పటికే పీసీ గంగన్న ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించగా నియోజకవర్గంలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ రెస్కో చైర్మన్‌ న్యాయవాది రాజశేఖర్‌ తన అనుచరులతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరారు. అటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇటు సొంత పార్టీ నుంచి అసమ్మతి పెరిగిపోవడంతో ‘పల్లె’ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

సేవా కార్యక్రమాలతో ‘దుద్దుకుంట’ ప్రజలకు చేరువ 
2014వ నుంచి పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని నియమించారు. ఆయన నాటి నుంచి నేటి దాకా  తన ట్రస్టు ద్వారా  వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు.  గ్రామాల్లో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా, నియోజకవర్గంలో 40 వేల మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించటంతో పాటు చదువులో  ప్రతిభ కనపరచిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. రావాలి జగన్‌..కావాలి జగన్, నిన్ను నమ్మం బాబు కార్యక్రమాల ద్వారా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటించిన నవరత్నాల పథకాలను ఇంటింటా వివరించారు. నవరత్నాల పథకాలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. దుద్దు్దకుంట సేవకార్యక్రమాలు, నవరత్నాలతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత వైఎస్సార్‌సీపీ కలిసివచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు