సెల్ఫీ కోసం స్టేజ్‌ దిగిన రాహుల్‌

24 Mar, 2018 12:48 IST|Sakshi

మైసూర్‌: నోట్లరద్దు, జీఎస్టీలు ముమ్మాటికీ నరేంద్ర మోదీ అవివేక నిర్ణయాలేనని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఒకవైపు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని పేర్కొన్నారు. శనివారం మైసూర్‌లో పర్యటించిన ఆయన మహారాణి కళాశాల విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ ఆసక్తికర సమాధానాలిచ్చారు.

నీరవ్‌ దోచేసిన సొమ్ముతో..: ‘‘చక్కటి నైపుణ్యం ఉన్నా ఆర్థిక తోడ్పాటు లేకపోవడం వల్లే యువత అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. నిన్నిటి నీరవ్‌ మోదీ కుంభకోణమే తీసుకోండి.. 22వేల కోట్లను ఆయన కాజేశారు. అదే సొమ్మును మీలాంటి యువతకు రుణంగా ఇచ్చిఉంటే ఎన్ని అద్భుతమైన వ్యాపారాలు చేసేవారో కదా!’ అని రాహుల్‌ అన్నారు. ‘సీ సర్టిఫికేట్‌ పరీక్షను పూర్తిచేసుకున్న ఎన్‌సీసీ క్యాడెట్లకు మీరు ప్రభుత్వంలో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు?’  అన్న ఓ విద్యార్థిని ప్రశ్నకు.. ‘‘నాకు ఈ ఎన్‌సీసీ గురించి పెద్దగా తెలియదు. ఆ శిక్షణ, వ్యవహారాల గురించి అవగాహనలేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను’ అని రాహుల్‌ అన్నారు.

సెల్ఫీ కోసం స్టేజ్‌ దిగి..: ప్రశ్నావళిలో భాగంగా ‘రాహుల్‌జీ.. మీతో ఓ సెల్ఫీ దిగాలనుంది..’ అని ఓ విద్యార్థిని అడగ్గానే చకచకా స్టేజ్‌దిగిన రాహుల్‌.. ఆమెతో సెల్ఫీ దిగడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఎన్నికల రాష్ట్రం కర్ణాటకపై ప్రత్యేక దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు విరివిగా పర్యటనను చేస్తూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగేఅవకాశముంది.

మరిన్ని వార్తలు